హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కులాల్ని టార్గెట్ చేస్తున్న రాజకీయాలు అనంతపురం జిల్లాలో కలకలం రేపుతున్నాయి. కమ్మ, రెడ్డి నేతలు అనంతపురం జిల్లాలో రక్తపాతం సృష్టించారని.. ఇక నుచి వారు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. తన కులం తరపు వారు ఏర్పాటు చేసిన కార్తీక భోజన కార్యక్రమంలో పాల్గొని హెచ్చరించారు. తన కులం ఒక్కరే ఓట్లు వేస్తేనే.. తాను ఎంపీ అయినట్లుగా ఆయన మాట్లాడటం.. ఇతర కులాల్ని కించ పరచడం.. అన్ని పార్టీల్లో ఉన్న ఆయా కులాల వారిని అసంతృప్తికి గురి చేసింది. రెడ్డి సంక్షేమ సంఘం.. మాధవ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గతంలో పోలీసుల్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏదో అన్నారని.. తనది పోలీస్ కులం అని.. సీఐగా ఉన్న మాధవ్ మీడియా ముందుకు వచ్చి తొడ కొట్టారు.
ఇప్పుడు.. ఆయన ఇతర కులాలపై విద్వేష ప్రకటనలు చేస్తూండటంతో ఆయా కుల సంఘాల నేతలు.. మాధవ్ తరహాలోనే ప్రకటనలు చేస్తూ.. మీడియా ముందుకు వస్తున్నారు. ఎక్కవ మాట్లాడితే నాలుక తెగ్గోస్తామని హెచ్చరిస్తున్నారు. చరిత్ర తెలుసుకోకుండా .. మీడియాలో పాపులారిటీ కోసం ఇష్టం వచ్చినట్లుగా మాటలు తూలితే.. తర్వాత బాధపడతారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే మాధవ్ మాత్రం.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కమ్మ, రెడ్లపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటున్నారు. ఆయన నోటి దురుసును రాజకీయంగా ఉపయోగిచుకునేందుకు కొంత మంది రాజకీయ నేతలు సిద్ధం అయ్యారు. ఆయనకు మద్దతుగా ఉన్నట్లుగా ప్రకటిస్తూ.. మరింతగా రెచ్చ గొడుతున్నారు.
గోరంట్ల మాధవ్‌తోనే మరికొంత మందిపై కులపరమైన విమర్శలు చేయించడానికి అధికార పార్టీలోని కొంత మంది ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన అంటున్న మాటలకు ఓ వర్గం మీడియా ప్రాధాన్యం ఇస్తూండటంతో … కొన్ని వర్గాలను రెచ్చగొట్టడానికి బాగా ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. సమాజాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల పరంగా విభజిస్తే.. ఆ విభజన ఎప్పటికీ ప్రజల మధ్య ఉండిపోతుందని.. తమ రాజకీయ పబ్బం గడుపుకోవచ్చని కొంత మంది ఆలోచన. ఆ రాజకీయంలో ఎంపీ మాధవ్ పావుగా మారుతున్నారన్న చర్చ ఇప్పుడు అనంతపురం జిల్లాలో నడుస్తోంది.