ప్రధానమంత్రి మోదీ చండీగఢ్ రాకతో అక్కడి ప్రధాన శ్మశానవాటికకాస్తా పార్కింగ్ ప్లేస్ గా మారిపోయింది. ఇదేదో ఎడారి నందనవనంలా మారిపోయినట్టు భావించనక్కర్లేదు. నిజం చెప్పాలంటే ఇది సిగ్గుచేటు వ్యవహారం. శ్మశానాలను మల్టీపర్పస్ స్థలాలుగా మార్చేయడం అధికారుల్లోని దౌర్భాగ్య చంచలస్థితిని తెలియజేస్తోంది.
అవసరమనిపిస్తే చాలు, చివరకు శ్మశానాన్ని కూడా వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే అనేక చోట్ల శ్మశానాలపై రియల్టర్ల కళ్లుబడి కబ్జాఅయిపోతుంటే, మరో పక్క సమాధులమధ్యనుంచే రోడ్లు వేసేస్తుంటే, ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలోనే చండీగడ్ లోని అతిపెద్ద శ్మశాన స్థలం పార్కింగ్ గా మారిపోయింది.
సరికొత్త ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించడంకోసం ప్రధాని మోదీగారు చండీగఢ్ వెళ్ళారు. ప్రధాని రాక సందర్బంగా పెద్ద సభను ఏర్పాటుచేశారు. సభ అన్నాక మరి వచ్చేపోయే వాహనాలను క్రమబద్ధీకరించడంకోసం పార్కింగ్ గట్రా ఉండాలికదా. అందుకే అప్పటికప్పుడు ఇవ్వాళ మధ్యాహ్నం ఒంటిగంటవరకు శ్మశానంలోని స్థలాన్ని తాత్కాలిక పార్కింగ్ గా అధికారులు అడ్డగోలుగా వాడేశారు. ఈ శ్మశానవాటిక నగరనడిబొడ్డున ఉంది. ఒకప్పుడు చండీగఢ్ శివారుప్రాంతంలోఉండే ఈ శ్మశానవాటిక ఊరు విస్తరించడంతో నడిబొడ్డుకు వచ్చినట్లయింది. నిత్యంరద్దీగా ఉండే ప్రాంతంలోఉన్న శ్మశానవాటిక ఉన్నట్టుండి మోదీరాకతో ఇప్పుడు పార్కింగ్ ఏరియాగా మారిపోయింది.
శ్మశానవాటిక ఇలా కారుపార్కింగ్ స్థలంగా మారిపోతే అంత్యక్రియలకోసం వచ్చేవారికి కష్టమేకదా అని మనలాంటివాళ్లు అనుకోవచ్చు. అయితే ఏలినవారు మాత్రం చాలా కూల్ గానే సమధానంచెబుతున్నారు. `ఇదంతా కాసేపే, కాస్తంత ఓపికపట్టండి, సభపూర్తవగానే కార్లు వెళ్ళిపోతాయి, అప్పటిదాకా శవాలను తీసుకురాకండీ, మరీ అర్జెంట్ అయితే వేరే శ్మశానవాటికకు మృతదేహాలను తరలించండి’ అంటూ అధికారులు చెబుతున్నారట. ఆహా, ఏమి కరుణ… ఆఖరకి అంత్యక్రియలు ఎక్కడ చేసుకోవాలో కూడా అధికారులే నిర్ణయించే పరిస్థితి దాపురించిది కదా…అని నిట్టూర్పు విడవడంతప్ప ఏమీచేయలేని పరిస్థితి ఇది.
`ఊరు’ – అన్న తర్వాత దానికి కొన్ని మౌలిక వసతులుంటాయి. అందులో శ్మశానం ఒకటి. ఈ సౌకర్యాన్ని అతిముఖ్యమైనదిగా అన్నిమతాలకు చెందినవారు విధిగా భావిస్తారు. అలాంటి శ్మశానవాటికను `మల్టీపర్పస్’ గా మార్చడం విడ్డూరంగానే ఉంది. వీలైతే గ్రేవ్ యార్డ్ లను పరిశుభ్రంగా ఉంచడం, వాటిలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించడం, ప్రశాంతవాతావరణాన్ని ఏర్పాటుచేయడం వంటి చర్యలు చేపట్టాలేగానీ, ఇలా పార్కింగ్ లకు వాష్ రూమ్ లకు ఇవ్వడం ముమ్మాటికీ అభ్యతరకరమే. పైగా ఇలాంటి చర్యలవల్ల అంత్యక్రియలు పూర్తిచేసుకోవాలని వచ్చేవారికి , నిత్యకర్మలు చేసుకునేవారికి ఇబ్బందులు కలుగుతాయన్న కనీసపు ఇంగితజ్ఞానం అధికారుల్లో లోపించడం శోచనీయం.
1999లో కార్గిల్ పోరాటంలో పాల్గొన్న బ్రిగేడర్ దేవిందర్ సింగ్ కుమారుడు నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 24ఏళ్ల తన కుమారుని భౌతికకాయానికి చండీగఢ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేయిద్దామనుకుంటే ఈ పార్కింగ్ కేటాయింపువల్ల కుదరలేదు. దీంతో మోహాలీకి తీసుకువెళ్ళాల్సివచ్చింది. ఇలాగే మరికొంతమంది కూడా ఇబ్బందులు పడాల్సివచ్చింది.
అయితే, వీటన్నింటితో తనకు ప్రమేయంలేదన్నట్టుగా ప్రధాని మోదీ చిద్విలాసంగా చంఢీగడ్ లో దిగి 900కోట్ల వ్యయంతో ఆధునికంగా నిర్మించిన సిటీ ఎయిర్ పోర్ట్ ను శుక్రవారం(11-09-15) ఘనంగా ప్రారంభించి ప్రసంగించారు. చివరగా చెప్పేదేమిటంటే… ప్రధాని వస్తున్నారంటే ఆరోజు బంద్ వాతావరణమే… స్కూళ్లకు సెలవు. పరీక్షలు వాయిదా…ట్రాఫిక్ డైవర్షెన్స్..ఇంకా అనేక చోట్ల 144 సెక్షన్. పోలీసుల హడావుడి. ప్రజలకు నానా అగచాట్లు. ఇదీ మన గ్రేట్ ప్రజాస్వామ్యదేశం.
– కణ్వస