హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంగ్లభాష ప్రావీణ్యం ఇంతకు ముందు ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. తడుముకుంటూ మాటలు వెతుక్కుంటూ మాట్లాడేవారు. ఇక ఏదైనా జాతీయ మీడియా సంస్థల విలేకరులతో, నేషనల్ టీవీ న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూలలో మాట్లాడేటప్పుడైతే బాబుగారి పరిస్థితి చూసేవారికే ఇబ్బందికరంగా ఉండేది. ముఖ్యంగా ఇటీవల ఓటుకు నోటు కేసు సమయంలో ఇండియాటుడే టీవీలో రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేసేటపుడు చంద్రబాబు మాటలు చూసి చాలామంది నవ్వుకున్నారు. ‘వాట్ అయామ్ సేయింగ్’, ‘వాట్ అయామ్ సేయింగ్’ అనటం తప్పితే తన పాయింట్‌ను చంద్రబాబు వివరించలేకపోయారు. అలాంటి చంద్రబాబు ఆంగ్లభాష ప్రావీణ్యం గతంతో పోల్చితే ఇప్పుడు గణనీయంగా మెరుగుపడిందని చెప్పాలి.
విశాఖపట్నంలో జరుగుతున్న పార్టనర్షిప్ సమ్మిట్‌లో నిన్న, ఇవాళ చంద్రబాబు పాల్గొన్నారు. దేశ విదేశాలనుంచి పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులనుద్దేశించి చంద్రబాబు ఆంగ్లంలో ప్రసంగించారు. అధికారులు తయారు చేసిన ప్రసంగాలను చదవటం కాకుండా ఆశువుగా మాట్లాడారు. అదికూడా గతంలోలా తడుముకోవటం, మాటలను వెతుక్కోవటం కాకుండా మెల్లగా, కూల్‌గా ప్రసంగించారు. గొప్ప భాషతో వేగంగా అనర్గళంగా మాట్లాడకపోయినా, సభికులకు తన పాయింట్ అర్థమయ్యేలా మాట్లాడారు. గమనిస్తే చంద్రబాబు ఒక సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. స్థిమితంగా, మెల్లగా మాట్లాడటం, పెద్ద పెద్ద పదాలకోసం చూడకుండా చిన్న చిన్న పదాలతో పాయింట్‌ను వివరిస్తున్నారు. భాషమీద కూడా కాస్త హోమ్ వర్క్, కసరత్తు లాంటిదేదో చేస్తున్నట్లు కనబడుతోంది. గతంలోకంటే ఎక్కువ పదాలను, మంచి పదాలను ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద మంచి ఇంప్రూవ్‌మెంటే. ఈ పని ఆయన ఎప్పుడో చేయాల్సింది. ఈ విషయంలో రాజకీయ నాయకులందరూ ప్రధాని నరేంద్ర మోడిని చూసి స్ఫూర్తిని పొందాలి. టీస్టాల్లో పనిచేసే స్థాయినుంచి ప్రధానమంత్రి పదవికి ఎదిగిన ఆయన ఐక్యరాజ్యసమితిలో, వైట్‌హౌస్‌లో, ఇతర అంతర్జాతీయ వేదికలపై ఆంగ్లంలో ఆశువుగా ప్రసంగించేస్తున్నారు. నేతల ఆంగ్లభాష విషయంలో ఇంప్రూవ్మెంట్ అంటే మోడీదే!