హైదరాబాద్: గుడివాడ పట్టణంలో వైసీపీ కార్యాలయం కార్యాలయ భవన వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ స్పందించారు. చిత్తూరు నగర మేయర్ అనూరాధ హత్యపై ఇవాళ మధ్యాహ్నం విజయవాడలో స్పందించే సందర్భంలో మొన్న జరిగిన గుడివాడ గొడవపైకూడా మాట్లాడారు. ఒక పండు ముదుసలి మహిళ తన ఇంట్లోనివారిని ఖాళీ చేయమని అడిగారని, ఖాళీ చేయకుండా దానిని రాజకీయం చేశారని అన్నారు. తాను ముసలిదానిని నడవలేకపోతున్నాను, పైకెక్కలేకపోతున్నానని అంటే ఆ వివాదంలోకి పార్టీలను, ముఖ్యమంత్రినికూడా లాగుతున్నారని విమర్శించారు. వారంటే భయపడిపోవాలని అనుకుంటున్నారని చెప్పారు. వారు దేశంమీదపడి ఇష్టానుసారంగా ప్రజలను బాధపెడుతుంటే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా శాంతి భద్రతలను తమ చేతుల్లోకి తీసుకుని రాజకీయం ముసుగులో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ, సవాళ్ళుకూడా విసురుతున్నారని మండిపడ్డారు. తప్పుడు పనులు చేస్తూ సవాళ్ళుకూడా విసరటం చూస్తుంటే వీరి పనులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలని భావిస్తున్నట్లుగా ఉందని అన్నారు.
గత పదేళ్ళుగా హత్యలు, స్మగ్లింగ్, లూటీలు, విధ్వంసాలు ఇష్టమొచ్చినట్లు సాగాయంటూ కాంగ్రెస్ పాలకులపై పరోక్ష విమర్శలు చేశారు. అదే పద్ధతిలో ఇప్పుడుకూడా చేయాలని చూస్తున్నారని అన్నారు. వీరిపట్ల కఠినంగా ఉంటామని చెప్పారు. అలాంటి వ్యక్తులకు భయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.