ముఖ్యమంత్రి చంద్రబాబు వారంలో రెండో సారి ఢిల్లీకి వెళ్తున్నారు. తొలి సారి..కొంత మంది నేతలతో సమావేశమైనా.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో జరిగిన చర్చలు హైలెట్ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సారి నేరుగా.. రాహుల్ గాంధీతో సమావేశం అవుతున్నారు. చంద్రబాబునాయుడు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లే అవకాశం లేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి చంద్రబాబు వెళ్తారు. ఆ సమయంలో… రాహుల్ గాంధీ కూడా అక్కడకు వచ్చే అవకాశం ఉంది. వారిద్దరి మధ్య అక్కడే చర్చలు జరుగుతాయని.. ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ – చంద్రబాబు మధ్య చర్చల్లో ప్రధానమైన ఎజెండా… ఐదు రాష్ట్రాల ఎన్నికలేనని ప్రచారం జరుగుతోంది.
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. బీజేపీని డిఫెన్స్‌లో పడేయాలంటే.. ముందుగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే.. ఆటోమేటిక్‌గా… విపక్షాలకు బలం వస్తుంది. అందుకే ముందుగా చంద్రబాబు.. కాంగ్రెస్ కు ఉన్న లోపాలను.. సవరించడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చేతిలోకి వస్తున్న విజయాలను చేజార్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తన వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో సరైన నాయకత్వం లేకపోయినా.. కాంగ్రెస్ పార్టీని రేసులోకి వచ్చేటట్లు చేయగలిగిన చంద్రబాబు…మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో… కూడా పరిస్థితులను అనుకూలంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే గత పర్యటనలో మాయావతితో చర్చలు జరిపారు. ఇప్పుడు రాహుల్ తోనూ.. ఆ మూడు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై హితబోధ చేసే అవకాశం అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
రాహుల్‌తో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తానని చంద్రబాబు పార్టీ నేతలకు చెబుతున్నారు. అందరితో కలిసి జాతీయస్థాయిలో… ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని.. అందులో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకు… నేను బాధ్యత తీసుకున్నాననంటున్నారు. టీడీపీపై, ఏపీపై రాజ్యాంగ సంస్థలతో.. దాడులకు తెగబడుతున్న బీజేపీని.. ఢిల్లీ స్థాయిలోనే ఢీకొట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. రెండు దశాబ్దాల క్రితం… సంకీర్ణ రాజకీయాల్లో ఆయన క్రియాశీలత ఇప్పుడు… ప్లస్ పాయింట్‌గా మారుతోంది.