మూడు విడతల ఎన్నికల పోలింగ్ తర్వాత.. దేశ రాజకీయాల్లో ఓ క్లారిటీ కనిపిస్తోంది. గతంలోలా.. బీజేపీకి… ఈ సారి వార్ వన్ సైడ్ అన్న పరిస్థితి లేదని.. ప్రాంతీయ పార్టీలు బలంగా నిలబడబోతున్నాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో.. మోడీని ఢీకొట్టే నాయకుడు ఎవరు అన్నదానిపై చర్చ జోరందుకుంది. వివిధ పార్టీల నేతలు.. వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ… ప్రాంతీయ పార్టీల్లో సమర్థులైన వారికి ప్రధాని పీఠం ఇస్తే మంచిదన్న అభిప్రాయం… సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్… ప్రధాని పదవికి రాహుల్ గాంధీ కన్నా…ప్రాంతీయ పార్టీల నేతలే బెటర్ ఆప్షన్ అని చెప్పుకొస్తున్నారు.
మాయావతి, మమత బెనర్జీ, చంద్రబాబు.. ఎన్డీయేతర పక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే వీరు ముగ్గురూ అర్హులే. కాంగ్రెస్ అధినేత రాహుల్ కంటే వీరిని ఎంచుకోవడమే ఉత్తమమని చెప్పుకొచ్చారు. నిజానికి ఇలాంటి చర్చ .. కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో నడుస్తోంది. పలు పార్టీలు.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడానికి కారణం కూడా.. ఆయా పార్టీల నేతలకు… ప్రధానమంత్రి ఆశలు ఉండటమే. మాయావతి ప్రధాని అవుతారని అఖిలేష్ యాదవ్ అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. మమతా బెనర్జీ కూడా.. ఢిల్లీ పీఠంపై గురి..బెంగాల్లో … అన్ని సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు.
అయితే చంద్రబాబు మాత్రం… ఈ విషయంలో.. తన ఆసక్తిని ఎప్పుడూ బయటకు వ్యక్తం చేయలేదు. మోడీని గద్దె దించడమే తన లక్ష్యమని చెబుతూ…పోరాటం చేస్తున్నారు. ఏదో ఓ అంశాన్ని తీసుకుని మోడీపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాల తర్వాత.. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల నేతలే కీలక పాత్ర పోషించబోతున్నట్లు తేలిపోతోంది. ఎన్నికల్లో.. చంద్రబాబును.. ఏపీ ప్రజలు ఆశీర్వదించి ఉంటే మాత్రం… ఢిల్లీలో చంద్రబాబు మరోసారి చక్రం తిప్పడం ఖాయమని అనుకోవచ్చు..!