బెల్లం చుట్టూ ఈగలు ముసురుకోవడం మనకు తెలుసు. అధికారం ఉన్నచోట… అధికారంతో ముడిపడి తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోజూసే వారంతా అడ్డగోలుగా ముసురుకుంటూ ఉంటారన్నది కూడా సత్యం. వీరికి పార్టీలతో నిమిత్తం లేదు. నాయకులతో సంబంధ బాంధవ్యాలతో నిమిత్తం లేదు. పార్టీల సిద్ధాంతాలు, అవి ప్రజల కోసం చేస్తున్న పథకాలు లాంటి వాటి గురించిన పట్టింపే లేదు. అధికారం ఎవరి చేతిలో ఉంటే.. వారి చుట్టూ ముసురుకుంటూ ఉంటారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చక్కబెట్టుకోవడానికి మాత్రమే తొలిప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే జరుగుతూ ఉన్నట్లుగా ఉంది. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిపోవడం అనేది రాజకీయ పునరేకీకరణలాగా జరుగుతూ ఉండగా, వైకాపాలో సభ్యులుగా, రాజకీయ నాయకులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ప్రస్తుతం అదే బాటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
వైకాపా తరఫున గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసిన పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా చాలా భారీ స్థాయిలో అప్పట్లో ఖర్చు చేసినట్లుగా పుకార్లు వచ్చాయి. అంత కీలకంగా పాటుపడిన నాయకుడు… ఇప్పుడు పార్టీ సభ్యత్వాన్ని కాదనుకుని… వైకాపాను వీడిపోవడం విశేషం. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లుగా మాత్రం ప్రకటించారు. కోనేరు ప్రసాద్‌గా వ్యాపార వర్గాల్లో చిరపరిచితుడైన కోనేరు రాజేంద్రప్రసాద్.. జగన్ అక్రమార్జనల కేసుల్లో కూడా నిందితుడు. కొంతకాలం జెయిల్లో కూడా ఉన్నారు. ఆ రకంగా జగన్‌కు సన్నిహితుడు గనుకనే.. విజయవాడ ఎంపీగా బరిలోకి దిగారు. అప్పట్లో ఓటమి తప్పలేదు. ఇన్నాళ్లకు పార్టీకి రాజీనామా చేశారు.
నిజానికి కోనేరు ప్రసాద్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలా కాలంగా చాలా సన్నిహితులని పేరుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఆయన చక్రం తిప్పారని కూడా అందరూ అంటుంటారు. చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే, ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి పంచన చేరి అక్కడ కూడా చక్రం తిప్పడం ప్రారంభించారు. అలాగని చంద్రబాబుతోనూ అదేస్థాయిలో సత్సంబంధాలను అప్పట్లోనూ కొనసాగించారు. చివరికి జగన్ కేసుల్లో తాను కూడా ఒక నిందితుడిగా చిక్కుకున్న తర్వాత.. పరిస్థితి అంతా తిరగబడింది. ఆయన ఆ కోటరీకే పరిమితం అయిపోయారు. ప్రస్తుతం ఆయన వైకాపా ను వదలిపెట్టేశారు. తిరిగి చంద్రబాబు కోటరీలో కీలకంగా చక్రం తిప్పే మరో సభ్యుడిగా నిలదొక్కుకోవడానికి ఆయనకు అట్టే సమయం పట్టకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.