పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన 50 రోజుల గడువూ పూర్తయిపోయింది. ఆ సందర్భంగా ప్రధాని దేశం ప్రజలను ఉద్దేశించి ఏదో మాట్లాడేస్తారూ అనుకుంటే… కొన్ని రాయితీలు ప్రకటించేసి పండుగ చేసుకోండి అనేశారు. ఇక, పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈ సందర్భంలో ఏమని స్పందించి ఉంటారో ఒక్కసారి ఊహించండి! అదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలోనే పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడల్సి వస్తే, చంద్రబాబు మాటలు ఎలా ఉంటాయో గెస్ చెయ్యండి..! తిరుపతిలో అలానే మాట్లాల్సిన అవసరం చంద్రబాబుకు వచ్చిందని చెప్పుకోవాలి.
తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో మోడీపై ప్రశంసలు కురిపించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన రెండు నిర్ణయాలు తీసుకున్న ఘనత మోడీకి దక్కుతుందని చంద్రబాబు అన్నారు. మొదటికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయమైతే, రెండోది జీఎస్టీ బిల్లు అని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యుడికి చాలా మేలు జరుగుతుందనీ, రాజకీయ అవినీతిని సమూలంగా అరికట్ట వచ్చని చంద్రబాబు వివరించారు. ప్రధానికి సాంకేతిక పరిజ్ఞానం అంటే చాలా ఇష్టమనీ, ఇదే విషయమై ఎప్పటికప్పుడు ఆయన ముందు ప్రస్థావిస్తుంటానని అన్నారు. ఇలా ప్రశంసా పత్రం మాదిరిగా ఇంగ్లిష్‌లో చంద్రబాబు మాట్లాడేశారు.
ఈ మాటలు వినగానే ఏం గుర్తొస్తోంది..? ‘పెద్ద నోట్లు రద్దు అనేది తీవ్రమైన సమస్య. ఇదో పెద్ద సంక్షోభం. నా రాజకీయ జీవితంలో ఇంత జఠిలమైన సమస్యను ఎప్పుడూ చూడలేదు. హుద్‌హుద్ తుఫాను, ఆగస్టు సంక్షోభం వంటి సమస్యలను సులువుగా పరిష్కరించాను. కానీ, నగదు కొరత తీర్చలేకపోతున్నాం. బ్యాంకర్లతో రోజుకు ఎన్ని గంటలు సమీక్షలు చేస్తున్న ప్రయోజనం ఉండటం లేదు’ అని చంద్రబాబు చెప్పిన మాటలు ఇంకా ప్రజల చెవుల్లో మార్మోగుతున్నాయి. ఇంతలోనే మోడీ గురించి ఇన్ని ప్రశంసలా..? గతంలో మోడీ నిర్ణయాన్ని విమర్శించింది ఈయనేనా..? పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారీ సంక్షోభం అని చెప్పింది ఈయనేనా..? ఇలాంటి అనుమానాలు చంద్రబాబు ప్రసంగం విన్నవారికి కలుగుతాయి.