నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుంచి తరలించడం కోసం జగన్ సర్కారు భారీ కుట్ర చేస్తోందని ఆరోపించారు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతాన్ని నీటితో ముంచాలన్న ఉద్దేశంతోనే ప్రకాశం బేరేజ్ లో నీటిని నిల్వ చేశారనీ, డామ్ కెపాసిటీ 3 టీఎంసీలు అయితే 4 టీఎంసీల వరకూ ఎందుకు ఉంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వరదతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు దీని గురించి ఎందుకు వైకాపా నేతలు మాట్లాడుతున్నారని నిలదీశారు. నా ఇల్లు మునిగిపోయే మా ఓనర్ కి ఇబ్బందిగానీ, ఏపీ మంత్రులకు ఎందుకు అన్నారు.
నీరు ఎక్కడుంటే నాగరికత కూడా అక్కడే అభివృద్ధి చెందుతుందనేది చరిత్ర చెప్పిన సత్యం అన్నారు. అందుకే, ఆంధప్రదేశ్ రాజధానిని కృష్ణా నది సమీపంలోని అమరావతిలో నిర్మించాలని తమ ప్రభుత్వం గతంలో నిర్ణయించిందన్నారు. పెద్ద పెద్ద నగరాలన్నీ నదుల పక్కనే ఉన్నాయని జగన్ సర్కారు తెలుసుకోవాలన్నారు. వరదని కృత్రిమంగా సృష్టించారనీ, ఎగువ రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో నీరు వస్తుందని ముందే తెలుస్తున్నప్పుడు, మన ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ముందుగానే ఎందుకు విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతి ముంపు ప్రాంతంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడాన్ని చంద్రబాబు నాయుడు ఖండించారు. 33 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారనీ, సువిశాలంగా రాజధాని నిర్మించుకున్నా ఇంకా 8 వేల ఎకరాలు మిగులుతాయన్నారు. ఖర్చు పెరిగిపోతుందనీ, ముంపు ప్రాంతమనే చర్చను లేవదీసి అమరావతి మార్చే ప్రయత్నం చేస్తే తాము ఊరుకోమన్నారు. ఇదే అంశమై ఏ స్థాయి పోరాటానికైనా తాను సిద్ధమని చంద్రబాబు నాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తీరు వల్లనే ఏపీకి పెట్టుబడులు రావడ లేదని అన్నారు.
రాజధాని విషయంలో వైకాపా సర్కారు ఒక నిర్ణయంతో ఉందనేది అర్థమౌతోంది. ఎన్నికల ముందు నుంచి కూడా అమరావతిపై స్పష్టమైన వైఖరిని సీఎం జగన్ ప్రకటించలేదు. సందిగ్ధతను కొనసాగిస్తూనే వచ్చారు. ఇప్పుడు దశలవారీగా మార్పు అవసరమే అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో చర్చ పెట్టాలనే ఉద్దేశంతోనే ముందుగా బొత్సతో ఈ కామెంట్స్ చేయించినట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ, ఇదే పట్టుదలతో జగన్ సర్కారు ముందుకు వెళ్తే… ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు అనిపిస్తోంది. కేవలం వరద ప్రాంతం, నిర్మాణ వ్యయం పెరిగిపోతుందనేవి రాజధాని నగరాన్ని మార్చడానికి సరిపడే కారణాలుగా కనిపించడం లేదు!