చంద్రబాబు నాయుడు మరోసారి జగన్ అవినీతిపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ చంద్రబాబు చేస్తున్న పని ఇదే. 2014 ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు ప్రధాన అస్త్రం ఇదే. రుణమాఫీలతో సహా చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం సాధ్యం కాదని, విభజన తర్వాత రాష్ట్ర ఆదాయం అంత ఉండదని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించిన సందర్భాల్లో చంద్రబాబు కొట్టిన డైలాగ్ ఒక్కటే. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. జగన్ తిన్న లక్షకోట్లను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచేస్తాం. హామీలన్నీ నెరవేరుస్తాం అని ప్రతి ప్రచార సభలోనూ చెప్పుకొచ్చాడు చంద్రబాబు. ఇక నారా వారసుడు లోకేష్ బాబుతో సహా టిడిపి నేతలందరూ అదే పాట పాడారు. అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడేళ్ళు కావస్తోంది. కేంద్రంలో బాబుకు జిగిరీ దోస్త్ అని టిడిపి మీడియా చెప్తున్న నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నారు. ఇక అపర చాణక్యుడు వెంకయ్యనాయుడు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయినప్పటికీ ఇప్పుడు అవే కుబుర్లు…అవే ఆరోపణలేనా?
జగన్ ఆస్తులు స్వాధీనం చేసుకుని ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. చంద్రబాబు మాటలను నమ్మినవాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ని ఏదో చేసేస్తాడు అని అనుకున్నారు. కానీ ఓటేసిన వాళ్ళకే వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. జగన్ని మాత్రం ఏమీ చేయలేకపోయాడు. ప్రధానిగా మోడీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కంటే కూడా కాంగ్రెస్ హయాంలోనే జగన్ కేసుల్లో స్పీడ్ ఉండేది. ఇప్పుడు అసలు జగన్ కేసుల్లో ఉన్న పురోగతి ఏంటి అంటే ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. పైగా చాలా మందికి కోర్టు హాజరీ నుంచి మినహాయింపులు ఇస్తున్నారు. ఆ లిస్టులో జగన్, విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు. అంటే జగన్ అవినీతి కేసుల్లో పసలేదు అని అనుకోవాలా? చంద్రబాబుతో సహా టిడిపి నేతలందరూ చెప్పినవి అబద్ధాలేనా?
ఈ ప్రశ్నకు సమాధానం చంద్రబాబు చెప్పగలడా? మోడీతో జగన్ కుమ్మక్కయ్యాడని చెప్పి టిడిపివాళ్ళు ఎదురుదాడి చెయ్యొచ్చు. కానీ టిడిపి వాళ్ళ దృష్టిలో ప్రపంచంలోనే నంబర్ ఒన్ అవినీతిపరుడయిన జగన్తో కుమ్మక్కయ్యాడంటే ఇక నరేంద్రమోడీ ఏ స్థాయి అవినీతిపరుడు అయి ఉండాలి? మరి ఆ రేంజ్ అవినీతిపరుడితో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కలిసి ఎలా సాగుతున్నారు? 2014లో జగన్ అవినీతి గురించి చంద్రబాబు చేసిన ప్రచారం టిడిపికి బాగా కలిసొచ్చింది. 2019లో కూడా అదే ప్రచారం చేయాలని అనుకుంటూ ఉంటే మాత్రం అంతకంటే అమాయకత్వం ఇంకొకటి లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నప్పుడు చేవలేని కబుర్లు ఎందుకు? చేతనైతే జగన్ ఆస్తలను స్వాధీనం చేసుకుని జైలుకు పంపండి. అవినీతి పరులను శిక్షించడం చేతకాని ముఖ్యమంత్రికి అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? చేతకాని మాటలతోనే కాలం వెళ్ళబుచ్చుతాం అంటే మాత్రం టిడిపి వాళ్ల ప్రచారం అంతా కూడా అబద్ధం అని నమ్మే ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంటుంది.