ఫిరాయింపులపై తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో మరో మీనింగ్ ఇచ్చారు! అయితే, జంప్ జిలానీల విషయంలో టీడీపీకి రెండు రకాలు అభిప్రాయాలున్న సంగతి తెలిసిందే! ఆంధ్రాలో ఒకలా.. తెలంగాణలో మరోలా! ఆంధ్రాలో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నది అధికారంలో ఉన్న తామే కాబట్టి.. అక్కడ ఫిరాయింపులను వెనకేసుకొస్తారు. తెలంగాణలో ఫిరాయింపుల వల్ల బాధిత స్థానంతో టీడీపీ ఉంది కాబట్టి… ఇక్కడ తీవ్రంగా తప్పుబడతారు! ఇప్పుడు కూడా ఇదే జరిగింది.
హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ తెలుగుదేశం నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్తు వ్యూహాలపై నాయకులతో చర్చించారు. కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ పార్టీ ఎదుగుదలకు కావాల్సిన ప్రణాళికలు రచించాలని నేతలకు సూచించారు. ప్రజలకు నిత్యం దగ్గరగా ఉండేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలనీ, బూతు స్థాయి కమిటీల దగ్గర నుంచీ ఈ సమావేశాలు జరగాలని చెప్పారు. ఇదే తరుణంలో కొంతమంది నేతలు టీడీపీని వదిలిపెట్టి, వేరే పార్టీల్లో చేరడం చర్చకు వచ్చింది! ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది పార్టీ మారినప్పుటికీ ఎలాంటి నష్టం లేదన్నారు. నాయకులు వెళ్లినా కార్యకర్తలు తమతోనే ఉన్నారని, అందుకు సాక్ష్యం ఇటీవల నిర్వహించిన ప్రజా పోరుకు కార్యక్రమాలకు లభించిన అశేష ఆదరణే అన్నారు.ఫిరాయింపులు అంటే స్వార్థ రాజకీయాలని తెలంగాణ నేతలతో చంద్రబాబు చెప్పారు.
గతవారంలో కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశమైన సంగతిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో కార్యకర్తలతో ఏపీ సీఎం మాట్లాడుతూ… కొత్తతరం నాయకులకు అవకాశం కల్పించామనీ, ఈ క్రమంలోనే కొంతమంది ఇతర పార్టీల వారికి అవకాశం ఇచ్చామని చెప్పుకొచ్చారు. కొన్ని కష్టాలున్నా, కొంతమందికి నష్టాలు ఉన్నా ఓర్చుకుంటున్నామని చెప్పారు. రాజకీయ ప్రక్షాళన కోసమే ఫిరాయింపులు అన్నట్టుగా మాట్లాడారు!
బాటమ్ లైన్ ఏంటంటే.. ఆంధ్రాలో ఫిరాయింపులు అనేవి రాజకీయ ప్రక్షాళన కోసం తెలుగుదేశం పార్టీకి తప్పడం లేదు! అదో అనివార్యతగా చెప్పుకుంటున్నారు. తెలంగాణలో ఫిరాయింపులు స్వార్థ రాజకీయాలు! ఇదో అవ్యవస్థగా ఇక్కడ నిర్వచిస్తున్నారు. తెలంగాణ నేతలు టీడీపీని వీడినా.. కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉంటారు! కానీ గమ్మత్తుగా, ఆంధ్రాలో ఇతర పార్టీల నుంచి నేతలు టీడీపీలో చేరితే.. కార్యకర్తలు కూడా పార్టీలోకి వచ్చేస్తున్నారు! ఈ ప్రక్షాళన ఏంటో.. స్వార్థ రాజకీయమేంటో.. రాష్ట్రానికో అభిప్రాయమేంటో..? ఇలాంటి ద్వంద్వ స్వభావాలను ప్రజలు గమనించరని అనుకుంటున్నా ఏమో..!