నవ నిర్మాణ దీక్ష కోసం ఏపీ సర్కారు భారీ ఎత్తున సిద్ధమైంది! జూన్ 2 నుంచి 8వ తేదీ వరకూ దీక్షలను నిర్వహించనున్నారు. ప్రతీరోజూ ఒక్కో అంశంపై చర్చలు జరపాలని వెలగపూడిలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీర్మానించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జరిగే దీక్షలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ ఉన్నా ఉదయం 10 గంటలకు జరిగే నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞలో విధిగా పాల్గొనాలని అన్నారు. భారత స్వతంత్ర దినోత్సవానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో… దీనికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రజలందరూ ఎక్కడున్నా, ప్రయాణంలో ఉన్నా, బస్సుల్లో ఉన్నా దీక్షను తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు! ఈ కార్యక్రమం తనకోసం కాదనీ, రాష్ట్రం కోసమనీ, ప్రజల భవిష్యత్తు కోసమని ముఖ్యమంత్రి చెప్పారు.
అయితే, ఈ నవ నిర్మాణ దీక్షల సందర్భంగా భారీ ఎత్తున ట్రాఫిక్ ఆంక్షల్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. రెండో తేదీన ఉదయం 4 గంటల నుంచీ సాయంత్రం 4 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలుస్తోంది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో చంద్రబాబు దీక్ష చేస్తారు. దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచీ వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని దారి మళ్లించబోతున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రాఫిక్ ను దేవరపల్లి, సత్తుపల్లి వైపు డైవర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చే ట్రాఫిక్ ను సూర్యాపేట, సత్తుపల్లి మీదుగా డైవర్ట్ చేయబోతున్నారు. దీంతోపాటు ఒంగోలు నుంచీ వచ్చే ట్రాఫిక్ ను కూడా వేరే దారుల్లోకి మళ్లిస్తున్నారు.
ప్రయాణికులకు ఇది ఇబ్బందికరమైన అంశమే. అయినా, రోడ్ల మీద దీక్షలు చేపట్టేందుకు అధికార పార్టీయే సిద్ధపడటం ఏంటో అనేది సామాన్యుడి ఆవేదన. నవ నిర్మాణ దీక్ష చేయడాన్ని ఎవ్వరూ తప్పుబట్టరు. పైగా, రాష్ట్ర అభివృద్ధి కోసం కాసేపు ప్రజలని ఆలోచించమనీ, ప్రతిజ్ఞ చేయించడం కూడా మంచిదే. కానీ, దీని కోసం సామాన్య జనజీవనాన్ని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకూ సబబు అనేదే అసలు ప్రశ్న..? అధికారం వారి చేతిలో ఉంది కాబట్టి, ఇలా దీక్షల పేరుతో రోడ్లపై సభలూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పని వేరే ఎవరైనా చేస్తే… చేయడం వరకూ ఎందుకూ, చేయాలని అనుకున్నా కూడా పర్మిషన్ ఇస్తారా..? జన జీవనానికి ఇబ్బంది కలుగుతుందని, అనుమతులు ఇవ్వలేం అనేస్తారుగా! కాదూకూడదు అని ముందుకెళ్తే పోలీసులు రంగంలోకి దిగి, లాఠీ ఛార్జ్ అనేస్తారు. ఇప్పుడు ఇది అధికార పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి… రోడ్ల మధ్యన సమావేశాలు జరుగుతున్నా దానికీ రక్షణ కల్పించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. అధికారంలో వారి చేతిలో ఉంది కాబట్టి, ఎలా అంటే అలానే…!