ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇంకా రాజకీయ ప్రకంపనలు రేపుతూనే ఉంది. తనపై ఉన్న కేసుల విముక్తి కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారనీ, ప్రధానమంత్రి కాళ్లు పట్టుకుని కేసులు కొట్టించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్లుంటే… ప్రత్యేక హోదా గురించి ప్రధాని దగ్గర ఎందుకు ప్రస్థావన తేలేదంటూ సీఎం చంద్రబాబు కూడా విమర్శించారు. అయితే, ఈ క్రమంలో చంద్రబాబు చేసిన తాజా విమర్శలు, మోడీకి కూడా తగిలేట్టుగా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జగన్ ను విమర్శించే క్రమంలో ప్రధాని మోడీపై కూడా టీడీపీ ఆరోపణలు చేస్తున్నట్టుగా ఉంది! ఓ మీడియా సంస్థ ఇచ్చిన కథనం ప్రకారం.. రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్రంలోని భాజపా సర్కారుకు జగన్ మద్దతు ఇస్తున్నారనీ, దీనికి ప్రతిఫలంగా తనపై ఉన్న కేసుల నుంచి బయపడాలని జగన్ ప్రయత్నిస్తున్నారనీ, ఇది క్విడ్ ప్రోకో అవుతుంది కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు కథనం. తనపై ఉన్న అవినీతి ఆరోపణలు, ఈడీ కేసుల నుంచి విముక్తి కల్పించుకోవడం కోసమే కేంద్రంతో జగన్ ఈ విధంగా డీల్ చేస్తున్నారని అన్నారట. ప్రత్యేక హోదా విషయంలో తాను నాడు రాజీపడింది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే అనీ.. హోదాకి సమానమైన ప్యాకేజీని సాధించుకున్నామని మరచిపోకూడదని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేసుల నుంచి విముక్తి పొందేందుకే మోడీ కాళ్లు జగన్ పట్టుకున్నారని విమర్శించడం వరకూ ఓకే. అది వైకాపాని విమర్శించినట్టు అవుతుంది. కానీ, క్విడ్ ప్రోకో కి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించడమే వేరే అర్థాలకు తావిస్తోంది. క్విడ్ ప్రోకో అంటే రెండు వైపులా లాభం ఉండాలి కదా. అంటే, రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయేకి మద్దతు ఇవ్వడం ద్వారా కేసుల నుంచి విముక్తి పొందడం జగన్ లబ్ధి అని చంద్రబాబు విమర్శించినట్టు అర్థం చేసుకోవాలి. ఇక, భాజపా సైడ్ నుంచి రాజకీయ లబ్ధి ఏంటంటే… జగన్ కేసులను అడ్డం పెట్టుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నట్టుగానే అనిపిస్తోంది కదా! క్విడ్ ప్రోకో అని ఆరోపిస్తే ఇలాంటి అర్థమే ధ్వనిస్తుంది కదా.
నిజానికి, జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడమే టీడీపీ నేతలకు నచ్చలేదన్నది వాస్తవం. ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో ప్రధాని భేటీ ఏంటీ అంటూ టీడీపీ నేతలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. దీనికి తోడు జగన్ భేటీ విషయంలో టీడీసీ స్పందనే సరిగా లేదన్నట్టుగా భాజపా నేతలు కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటున్నారు! మొత్తానికి, ప్రధానితో జగన్ భేటీ కావడంపై టీడీపీ ఇంకా లోలోపల రగులుతోందని మాత్రం అర్థమౌతోంది.