ఆంధ్రప్రదేశ్‌కు సినీ పరిశ్రమను తీసుకు వచ్చేయాలని చంద్రబాబు అనుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమపై కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని ఆయన భావిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కొంత మంది మీడియా ప్రతినిధులతో చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమాల ప్రస్తావన తెచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ సినిమాలకు హబ్‌గా మారిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో టీడీపీ హయాంలో సృష్టించిన మౌలిక సదుపాయాల వల్లనే ఇది సాధ్యమయిందన్నారు.
ఒకప్పుడు ఏపీలో ఎక్కువ మంది సినిమాలు చూసేవారు.. హైదరాబాద్‌లో తక్కువగా చూసేవారన్నారు. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగా పెరిగిందన్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు సమస్య కాదని, దాని కంటే పెద్ద సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. అదే సమయంలో అమరావతి నిర్మాణం పూర్తయితే సినీ రంగానికి మంచి అవకాశాలు ఉంటాయన్నారు. అప్పుడు షూటింగ్‌ల కోసం వారే తరలి వస్తారన్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఓ పరిశ్రమను ఓ రాష్ట్రం నుంచి తీసేసి మరో రాష్ట్రానికి తరలించడం అంత తేలిక కాదు. ముఖ్యంగా సినీ పరిశ్రమ వంటివి ఓ చోట పెట్టి ఉత్పత్తి చేసేవి కావు. మౌలిక సదుపాయాలు పెరగాలంటే చాలా కాలం పడుతుంది. ఆ మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే సినిమా వాళ్లను ఆహ్వానించడంపై చంద్రబాబు ఆలోచన చేస్తారని అనుకోవచ్చు.