ఆరు నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడని అమరావతి చుట్టూ రాజకీయం రాజుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు.. అమరావతి పర్యటనతో వేడి ప్రారంభమయింది. ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభిస్తామని ప్రకటించింది. వైసీపీకి చెందిన కొంత మంది నేతలు.. చంద్రబాబును అడ్డుకుంటామని బయలుదేరారు. ఇవన్నీ ఓ ప్రణాళిక ప్రకారం జరిగినట్లుగా… తెలిసిపోతున్నా.. పోలీసులు ఎవరొస్తున్నారు.. ఏం తెస్తున్నారనేది.. లైట్ తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరిగేలా చూసి… రాజకీయ అలజడి రేపి.. అక్కడ రాజధానిగా… అమరావతి ఉండటం అక్కడి ప్రజలకే ఇష్టం లేదన్న వాదనను.. తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు టీడీపీ నేతల్లో బలపడుతున్నాయి. దానికి దశాబ్దాల కిందటి.. చెప్పులు, రాళ్ల వ్యూహాన్ని అమలు చేస్తున్నారంటున్నారు..
అమరావతిలో ఒక్క ఇటుక పడలేదని… అమరావతి సచివాలయంలో కూర్చుని మంత్రులు చెబుతూంటారు. పీపీఏల విషయంలో కేంద్రాన్ని ధిక్కరిస్తూ.. అమరావతిలో ఉన్న హైకోర్టులోనే పిటిషన్లు వేస్తూంటారు. పాలనా పరమైన జీవోలన్నీ.. అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ నుంచే వస్తూంటాయి. తొంభై శాతం పూర్తయిన భవనాలు.. కొల్లలుగా కనిపిస్తూంటాయి. అయినప్పటికీ.. అమరావతిలో ఏం లేదని చెప్పడానికే.. వైసీపీ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో.. చంద్రబాబు పర్యటన… అక్కడ ఆరు నెలల కిందట వరకూ జరిగిన అభివృద్ధిని ప్రజల్లో చర్చకు పెడుతుందన్న ఉద్దేశంతోనే.. అలాంటి పరిస్థితి లేకుండా.. ముందస్తు అలజడి వ్యూహం రేపారన్న అభిప్రాయాలు కూడా.. ఇతర పార్టీల్లో వినిపిస్తున్నాయి.
అమరావతిని జగన్ దశలవారీగా చంపేస్తున్నారని… చంద్రబాబు వ్యాఖ్యానించడంలో కూడా.. లోతైన అర్థం ఉందంటున్నారు. ఓ సారి ముంపు.. మరో సారి ఖర్చు ఎక్కువ.. మరో సారి కులం పేరుతో.. రాజధానిపై.. ఎన్నిరకాల ముద్రలు వేయాలో.. అన్నీ ప్రస్తుత సర్కార్ వేసింది. ఈ క్రమంలో.. అక్కడి ప్రజల మధ్య చీలిక తెచ్చి… వారి కంటిని వారి వేలితోనే పొడిచే ప్రక్రియకు తెరతీశారన్న అభిప్రాయం.. టీడీపీలో వినిపిస్తోంది. అసలు కారణం ఏమిటో.. ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీతో తేలిపోతుందంటున్నారు.