హైదరాబాద్: ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో చర్చను ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారపార్టీ సభ్యులు తనపై చేసిన విమర్శలకు స్పందిస్తూ, ఓటుకు నోటు కేసును ప్రస్తావించటంతో సభలో గందరగోళం చెలరేగింది. కమిషన్లు తీసుకుని లంచాలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారని జగన్ ఆరోపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లోకూడా రుజువయిందని చెప్పారు. ఈ ఆరోపణలపై అధికారపార్టీ సభ్యులు మండిపడటంతో సభలో గందరగోళం చెలరేగింది. అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అలాంటి అసెంబ్లీలో వైసీపీ సభ్యులు బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. పవిత్రమైన సభలో నీచంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్తో లాలూచీపడి తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మీ నాన్నే నన్నేమీ చేయలేకపోయారు, నువ్వేమి చేస్తావని మండిపడ్డారు. తాను నిప్పులాగా బతికానని చెప్పారు. జగన్, హరీష్ రావు ఎక్కడ కలిశారో తమకు తెలుసని చెప్పారు. జగన్ దోచుకున్న లక్ష కోట్లు రాష్ట్రాభివృద్ధికి ఇవ్వాలని మంత్రి రావెల అన్నారు.