కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ అయ్యారు. నిన్న సాయంత్రమే ఈ భేటీ జరగాల్సి ఉన్నా… ఎన్నికల ప్రచారంలో రాహుల్ బిజీగా ఉండటం వల్ల ఇవాళ్ల ఉదయం వీరి సమావేశం జరిగింది. దాదాపు అర్ధగంట పాటు సాగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. వీవీప్యాట్ల లెక్కింపు అంశమై సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు, ఈవీఎంలపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అనుమానాలపై చర్చ జరిగిందని సమాచారం. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
దేశంలో మరో రెండు విడతలు పోలింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో… ఫలితాల తరువాత భాజపా వ్యతిరేక పార్టీల కూటమి ఏర్పాట్లకు సంబంధించి అంశం కూడా ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. భాజపా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదనీ, గత ఎన్నికల్లో మాదిరిగా సొంతంగా భాజపాకి పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశాలూ కనిపించడం లేదని ఈ ఇరువురు నేతలూ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఎన్నికల తరువాత ఏయే పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందీ, ప్రభుత్వం ఏర్పాటుకు ఉండే సానుకూల పరిస్థితులపై రాహుల్, చంద్రబాబులు సమాలోచనలు చేసినట్టు సమాచారం. భాజపా బలం తగ్గుతోంది కాబట్టి, ఇలాంటి సమయంలో ఇతర పార్టీలను ఏకం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలుస్తోంది.
భాజపా వ్యతిరేక పార్టీలను ఐక్యం చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు మొదట్నుంచీ క్రియాశీల పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, ఇతర పార్టీల నేతలతో ఎలా వ్యవహరించాలనే అంశంపై చంద్రబాబుకు రాహుల్ కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు, కర్ణాటకలకు చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇవాళ్ల ఢిల్లీ నుంచి నేరుగా పశ్చిమ బెంగాల్ వెళ్తారు. మమతా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తారు. ఈ పర్యటనల్లోనే ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ఆయా రాష్ట్రాల నేతలతో చంద్రబాబు చర్చిస్తున్న విషయాన్ని కూడా రాహుల్ కి చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి, రాహుల్-చంద్రబాబు భేటీ రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు.