టీడీపీలో ఎంపీగా ఉండటం అంటే నిరంతరం అధినేత చంద్రబాబు పెట్టే టాస్కులను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 2014-19 మధ్య టీడీపీ ఎంపీలు ఓ ఉద్యమమే చేయాల్సి వచ్చింది. కేంద్ర మంత్రుల వెంట పడటానికి మొదటి నాలుగేళ్లు కేటాయించారు. ఆ తర్వాత బీజేపీపై పోరాటానికి మిగిలిన సమయం కేటాయించారు. చివరికి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా కూడాచేయాల్సి వచ్చింది. అంత చేసినా తర్వాత ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే గెలిచారు.
ఇక వైసీపీ హయాంలో ఇరవై రెండు మంది లోక్ సభ ఎంపీలు గెలిచారు కానీ వారు చేసిందేమీ లేదు. మ్యాట్రిక్స్ ప్రసాద్ సెర్బియాలో అరెస్టు అయినప్పుడు ఆయనను కాపాడటానికి.. రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయడానికి స్పీకర్ ను కలవడానికి తప్ప ఎంపీలతో చేయించిన పనులేమీ లేవు. పైగా తమ తమ అనుమతి లేకుండా ఎవరినైనా కలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు కూడా ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు ఏపీ ఎంపీలు ఢిల్లీలో పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతున్నారు.
చంద్రబాబు టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు పంచేశారు. ఎవరెవరు ఏ శాఖలో రాష్ట్ర అంశాలపై ఫాలో అప్ చేయాలో … బాధ్యతలు ఇచ్చారు. రాష్ట్ర నిధులకోసం ఆ ఎంపీలు నిరంతరం ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖల చుట్టూ తిరగాలి. వారికి కావాల్సిన సాయాన్ని రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తారు. ఖాళీగా ఉండటం కన్నా.. ఎంపీలుగా రాష్ట్రం కోసం ఇలా పని చేసినా సంతృప్తిగా ఉంటుందని ఎంపీలు ఫీలవుతున్నారు.