జనసేన , టీడీపీ జిల్లాల విభజనపై ఒకే మాట మీద ఉన్నాయి. జిల్లాలు శాస్త్రీయంగా విభజన చేయలేదని.. రాజకీయ అవసరాల కోసమే విభజించారని.. ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని.. పరిగణనలోకి తీసుకోలేదని తాము వచ్చాక మార్చేస్తామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. ముందుగా పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తామని నేరుగా చెప్పలేదు కానీ.. ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్ వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే చెప్పారు. జిల్లాల విభజనలో జరిగిన తప్పులను సవరిస్తామని ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన జిల్లాల విభజన విషయంలో ఒకే మాట మీదకు వచ్చినట్లయింది. ఈ విషయంలో బీజేపీఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. తాము వచ్చిన తర్వాత జిల్లాలను మారుస్తామనో.. లేదో ఇంకా ప్రకటించలేదు.
నిజానికి ప్రభుత్వం చేసిన విభజన విషయంలో చాలా జిల్లాల్లో అసంతృప్తి ఉంది. తాము ఏదో కోల్పోయామని ప్రతి జిల్లా వాసులు అనుకుంటున్నారు. దీని వల్ల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా ఎక్కడా ప్రజల్లో కదలిక కనిపించలేదు. ఓ రకమైన నిరుత్సాహమే కనిపించింది. ఖర్చు చేయడానికి నిధుల్లేకపోవడంతో ప్రభుత్వం కూడా వీలైనంత వర్చువల్‌గానే కార్యక్రమాలు పూర్తి చేసింది.