మూడేళ్లపాలన సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే తీరు విచిత్రంగా వుంది. ఎవరైనా మేము వేసే రోడ్ల మీదనే వెళ్లాలి, మేము నడిపే బస్సులే ఎక్కాలి అంటూ ఓటుమాత్రం మరెవరికి వేస్తారని ప్రశ్నించడం తమాషాగా వుంది. ఇదే తర్కం ప్రకారమైతే ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వాలు నడిపే పార్టీలు ఓడిపోకూడదు. అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యతలే తప్ప అవి ఘనకార్యాలు కావు.వాటిలోనూ అనేక లోపాలు లొసుగులు అక్రమాలు అవతతవకలు వుండనే వున్నాయి. హైదరాబాదును తాను అభివృద్ధి చేయడం వల్లనే అన్ని చోట్లనుంచి అక్కడకు చేరారంటున్న చంద్రబాబు ఆ నగరం నలభై ఏళ్లు రాజధానిగా వున్నాక తను అధికారంలోకి వచ్చానని మర్చిపోతున్నారు. అంతకు ముందు అది ఎడారిగా లేదు. అప్పుడు ఐటికూడా లేదు. చేసిందానికి సంతోషం వేరు అతిశయోక్తిగా చెప్పుకోవడం వేరు.ఇక ఇప్పుడు అమరావతిలోనూ అదే నమూనాను అనుసరిస్తారని 35 లక్షల జనాభా వచ్చేస్తారని చెప్పడం దీని కొనసాగింపే. విజయవాడ గుంటూరు నగరాల్లోనే ఇంతవరకూ ఇందులో సగం జనాభా కూడా లేదు. ప్రపంచంలో ఎక్కడా అంత వేగంగా జనాభా తరలివెళ్లిన దాఖలాలు కూడా లేవు. విజన్ల గురించి ముందస్తు ప్రణాళికల గురించి చెప్పే చంద్రబాబు ఇంత తేలికైన లెక్కలు ఎలా వేస్తున్నారో అర్థం కాదు.అసలు మహానగరాల కాన్సెప్ట్ మంచిది కాదని పట్టణ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. అందుకే పాత నగరాలను మినహాయిస్తే కొత్తగా మనం వేరే పేర్లు వినడం చాలా తక్కువ.పుత్రజయ వంటివాటి జనాభా గాని పరిధిగాని చాలా పరిమితం. కనుక ముఖ్యమంత్రి వాస్తవికంగా త్వరితంగా రాజధాని నిర్మాణం చేస్తే మంచిదితప్ప నేను కన్నెర్ర చేస్తే తట్టుకోలేరని భయపెట్టచూడటం సరికాదు. కావలసింది కళ్లు తెవరవడే గాని ఎర్రబడటంకాదు!