ఇంట్లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం కామనే. కాఫీ ఎలా ఉందని ఇంట్లో సతీమణులు అడగడం కూడా కామనే. కానీ చంద్రబాబు, భువనేశ్వరి విషయంలో రివర్స్‌లో జరిగింది. అదీ కూడా సోషల్ మీడియాలో. కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అని.. చంద్రబాబు అడిగితే.. భువనేశ్వరి కూడా అంతే స్వీట్ గా సమాధానం ఇచ్చారు.
అసలేం జరిగిందంటే.. నిజం గెలివాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి అరకులో పర్యటిస్తున్నారు. అక్కడ అరకు కాఫీ దుకాణం ముందు కాఫీ తాగారు. కాఫీ షాప్ ముందు కూర్చుని భువనేశ్వరి కాఫీ తాగుతూ ఫోటో దిగారు. ఆ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు చంద్రబాబునాయుడు తన అధికారిక ఖాతా నుంచి.. కాఫీ ఎలా ఉంది భువనేశ్వరి అని ప్రశ్నించారు.
చంద్రబాబు ట్వీట్ చేసిన కొంత సేపటికి భువనేశ్వరి కూడా స్పందించారు. కాఫీ అద్భుతంగా ఉందన్నారు. మన కిచెన్ లో ఉన్నప్పటికీ అరకు ప్రకృతి మధ్య అరకు కాఫీ తాగితే కలిగే అనుభూతి వేరుగా ఉంటుందన్నారు. ఇక్కడి గిరిజనుల ఆత్మీయత అరకు కాఫీకి ప్రత్యేకమైన రుచి వస్తుందేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు .అదే సమయంలో అరకు కాఫీని ప్రమోట్ చేసిన చంద్రబాబు కృషిని కూడా భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరకు బ్రాండ్ కాఫీని అంతర్జాతీయంగా మార్కెట్ చేసే అవకాశాల్ని కల్పించారు. గిరిజనలకు మంచి ఉపాధి లభించడంతో పాటు..అరకు కాఫీకి ప్రపంచ ప్రసిద్ధమైన గుర్తింపు వచ్చింది. అమెరికాలో కూడా పలు చోట్ల స్టాల్స్ ఉన్నాయి. అరకు కాఫీని చంద్రబాబు ప్రమోట్ చేసిన విషయాన్ని నారా భువనేశ్వరి తన ట్వీట్లో గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు భువనేశ్వరి కాఫీ కబుర్లు వైరల్ అయ్యాయి.