ఇంగ్లిష్ మీడియం క్రెడిట్ ఎవరికి..? ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైన సమయంలో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇంగ్లిష్ మీడియం క్రెడిట్ మాదంటే..మాదని…వాదులాడుకున్నారు. ఇంగ్లిష్ మీడియానికి టీడీపీ వ్యతిరేకం కాదని..జగన్ వల్లే ఇంగ్లిష్ మీడియం వచ్చిందనడం సరికాదని చంద్రబాబు చెప్పారు. ప్రాథమిక స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టామని .. ఇంగ్లిష్ మీడియాన్ని మేమే ప్రమోట్ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. మీరే ఇంగ్లిష్‌ను కనిపెట్టినట్టు మాట్లాడొద్దని .. తాము మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లిష్‌ను ప్రవేశపెడితే మీరు వ్యతిరేకించలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇంగ్లిష్‌పై రెండునాలుకల ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని అధికారంలో ఉన్నప్పుడు ఒకలా… విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు ఈ మాటలు.. వైసీపీకి ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. తాను ఏనాడు ఇంగ్లిష్‌ను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు.ఇంగ్లిష్‌ను వ్యతిరేకించానని మీరు నిరూపించగలరా అని సవాల్ చేశారు. మీకు అవకాశం ఉండి కూడా ఇంగ్లిష్‌ను ఎందుకు ప్రమోట్ చేయలేదన్నారు. ఓ దసలో అసహనానికి గురై… మీకు బుద్ధి ఉందా అంటూ ఆవేశపడ్డారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే… నేను ఇంగ్లిష్‌ను వ్యతిరేకించినట్టు నిరూపించమని సవాల్ చేశారు.
చంద్రబాబునాయుడు హయాంలో.. మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడితే.. వైసీపీ బహిరంగంగా వ్యతిరేకించింది. తెలుగును చంపేస్తున్నారని గగ్గోలు పెట్టింది. తెలుగు ప్రముఖులతో వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టించి విమర్శలు గుప్పించారు. సాక్షి పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా కథనాలు రాయించారు. అయితే.. జగన్ సీఎం కాగానే.. మొత్తంగా ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.