ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ నేరుగా మాటల యుద్ధానికి దిగడంతో సభలో చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోలార్ పవర్, కృష్ణపట్నం, విటిపిఎస్ ప్రాజెక్టులలో చాలా బారీ స్థాయిలో అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఆరోపణలను నిరూపించాలని లేకుంటే సభలో అందరి ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.
జగన్మోహన్ రెడ్డి ఆ ఆరోపణలను రుజువు చేయలేకపోతే, వైకాపా సభ్యులు అతని స్థానంలో మరొకరిని శాసనసభ నేతగా ఎంచుకొని మాట్లాడాలని చంద్రబాబు నాయుడు సూచించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తన మంత్రులు ఎవరయినా అవినీతికి పాల్పడినట్లు సరయిన ఆధారాలు చూపితే వారిని ఇక్కడే సభలోనే డిస్మిస్ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. జగన్ తన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేసారు. సభలో ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సభలో రౌడీయిజం చేయాలని చూస్తే కోరలు పీకేస్తానని జగన్మోహన్ రెడ్డిని నేరుగా హెచ్చరించారు.
దానికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం భయపడకుండా చంద్రబాబు నాయుడుపై ఎదురు దాడికి దిగారు. చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కళ్ళేసుకొని ఉరుమురిమి చూస్తూ మాట్లాడినంత మాత్రాన్న తనేమీ భయపడిపోనని జగన్ అన్నారు. ఈ అవినీతికి ముఖ్యమంత్రే బాధ్యుడని తాము వాదిస్తుంటే ఆయన తమ ఆరోపణలను ఎదుర్కొంటానని దైర్యం చెప్పేలేకపోతున్నారని ఎద్దేవా చేసారు. తాము పూర్తి సాక్ష్యాధారాలతో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నమని ముఖ్యమంత్రిలో ఏమాత్రం నిజాయితీ మిగిలున్నా వెంటనే సిబీఐ విచారణకు ఆదేశించాలని జగన్ డిమాండ్ చేసారు.
ఒకప్పుడు తన తండ్రి రాజశేఖర్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు ఇదే విధంగా ఆరోపణలు చేసి సిబీఐ విచారణకు డిమాండ్ చేస్తే, అందుకు ఆయన వెంటనే అంగీకరించిన సంగతిని జగన్ ఈ సందర్భంగా గుర్తుచేసి, చంద్రబాబు నాయుడు సిబీఐ విచారణకు ఆదేశించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయుడు నిజంగా ఏ తప్పు చేయలేదని భావిస్తున్నట్లయితే సిబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.