కృష్ణా పుష్కర స్నానం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన ప్రకటనే చేశారు. పుష్కర ఏర్పాట్ల గురించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. తొలి రోజు భక్తులు పెద్దగా రాకపోవడానికి కూడా ఒక రీజన్ చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రధానఘాట్ లు వెలవెలబోతున్న నేపథ్యంలో దీనిపై బాబు స్పందిస్తూ.. వరలక్ష్మి వ్రతం కాబట్టి ప్రజలు ఈ రోజున పుష్కర స్నానం చేయడం లేదు.. అందుకే తొలి రోజు జనాలు పెద్దగా రాలేదని బాబు అన్నారు. ఇదే సమయంలో ఆయన చేసిన మరో ప్రకటన.. ప్రత్యేక హోదా అంశం గురించి.
ఏపీకి వీలైనంత త్వరగా ప్రత్యేకహోదా రావాలని పుష్కరుడిని తాను మొక్కుకున్నానని బాబు చెప్పారు! మరి ఇది ఎందుకు ఆసక్తికరమైనది అంటే.. ఏపీకి ప్రత్యేక హోదా తో ఒరిగేదేమీ లేదని సరిగ్గా కొన్ని గంటల ముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నేత నారా లోకేష్ బాబు వ్యాఖ్యానించాడు. ప్రత్యేకహోదా సంజీవని కాదు.. అని లోకేష్ స్పష్టం చేశాడు. ప్రత్యేకహోదా కలిగిన వివిధ రాష్ట్రాలను పరిశీలించినా ఈ విషయం అర్థం అవుతుందని లోకేష్ చెప్పుకొచ్చాడు!
మరి లోకేషేమో.. ప్రత్యేకహోదా తో ఉపయోగం లేదని తేల్చితే, చంద్రబాబు ఏమో ప్రత్యేకహోదా కోసం పుష్కరుడిని ప్రార్థించానని చెబుతున్నారు! ఏపీలో ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఇద్దరు ముఖ్యుల ప్రత్యేకించి తండ్రీ కొడుకుల మాటలు ఇవి! మరి లోకేష్ దృష్టిలో ఉపయోగం లేనిది అయిన ప్రత్యేకహోదా గురించి బాబు పుష్కరుడిని మొక్కుకున్నారా లేక పుష్కరుడిని ప్రార్థించి మరీ తెచ్చుకోదగినది అయిన ప్రత్యేకహోదాను లోకేష్ బాబు తక్కువ చేసి మాట్లాడారా! ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం వాళ్లదే!