తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన చీప్ పవన్ కల్యాణ్ శనివారం డిన్నర్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టోపైన, సీట్ల పంపిణీ పైన, ఎవరు ఎన్ని స్థానాలలో ఎక్కడెక్కడ నుండి పోటీ చేయాలి అనే అంశాల పైన క్లారిటీ కి వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై అంతర్గతంగా చర్చలు నిర్వహిస్తున్నాయని ఇప్పటికే రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
బలమైన స్థానాల్లోనే పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. పట్టుదలకు పోయి బలహీన స్థానాల్లో పోటీ చేయడం వైసీపీకి మేలు చేసినట్లవుతుందని..అందుకే పూర్తిగా బలమున్న స్థానాల్లోనే పోటీ చేస్తామంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అయితే వ్యూహాత్మకంగా ఇంకా ప్రకటన చేయలేదని.. సంక్రాంతి పండుగ తర్వాత ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ తొలి జాబితాను సంక్రాంతికి ప్రకటించాలనుకుంటున్నారు. ఎలాంటి వివాదాలు లేని పాతిక సీట్లను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది జనసేనకు కేటాయిస్తారని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే పవన్ కల్యాణ్ తమ పార్టీ అభ్యర్థుల కసరత్తును కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జనసేనలో చేరే నాయకుల సంఖ్య పెరిగింది. టిక్కెట్ కేటాయిస్తామంటే వైసీపీ నుంచే చేరే నేతలు ఎక్కువగానే ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ జంపింగ్ జపాంగ్స్కు సీట్లివ్వాలని అనుకోవడం లేదు. అందుకే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
భోగి పండుగ అయిన ఆదివారం ఉదయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మందడం లోని గోల్డెన్ రూల్ స్కూల్లో జరగనున్న భోగి వేడుకలలో పాల్గొంటారు. ఏపీలో వైసీపీ సర్కార్ తెచ్చిన ప్రజా వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయనున్నారు.