కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మొట్ట మొదటిసారిగా తాము ఖమ్మంలో వేదికను పంచుకుంటున్నామంటే… ఇది ఒక చారిత్రక అవసరం అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే, ఈ ప్రజా కూటమితోనే ఆ ఐక్యతకు ఇక్కడి నుంచే నాంది పలికామన్నారు. దేశం బాగుంటేనే మనం బాగుంటామనీ, కానీ ఈరోజున ప్రజాస్వామ్యం అపహాస్యం పాలౌతున్న పరిస్థితి ఉందనీ, వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు. నాలుగున్నరేళ్ల ఎన్డీయే ప్రభుత్వం వల్ల ఎవరైనా లాభం కలిగిందా అని ప్రశ్నించారు.
37 సంవత్సరాలుగా కాంగ్రెస్ తో తెలుగుదేశం పోరాటం చేసిందనీ, ఈరోజున రెండు పార్టీలూ కలిశామంటే అది దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసమే అన్నారు ఏపీ సీఎం. రాష్ట్రం రెండుగా విడిపోయినా.. తెలుగు జాతి ఎప్పటికైనా ఒకటిగా ఉండాలన్నారు. తాను ఎప్పుడూ సమ న్యాయమని మాట్లాడానని గుర్తు చేశారు. విభజన తరువాత ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉన్నా, తెలంగాణకు బయ్యారం లాంటివి ఉన్నా కూడా అమలు చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చట్టప్రకారం రావాల్సినవి ఉన్నా కూడా కేంద్రాన్ని తెరాస అడగదన్నారు. తాను ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తానని అంటున్నారనీ, అలాంటి అవకాశం ఉంటుందా అనేది ఆలోచించాలన్నారు. తాను ఆంధ్రా ముఖ్యమంత్రిగా ఉంటాననీ, తెలంగాణ హితం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. హైదరాబాద్ కట్టానని చెప్పుకుంటున్నా అంటూ విమర్శిస్తున్నారనీ.. తాను ఎప్పుడూ అలా చెప్పుకోలేదనీ, సైబరాబాద్ రూపకల్పన చేసింది తానేనని చంద్రబాబు చెప్పారు. తాను తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ అడ్డుపడలేదన్నారు. తనను కేసీఆర్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఎన్డీయేకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనీ, అందుకే కాంగ్రెస్, టీడీపీలతోపాటు… ఇతర పార్టీలను కలుపుకుంటూ 10వ తేదీన సమావేశం పెట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను తాను అడుగుతున్నాననీ… ఎక్కడ ఉంటారో చెప్పాలన్నారు. ఎమ్.ఐ.ఎమ్.ని కూడా అడుతున్నా.. మీరెక్కడుంటారని అని చంద్రబాబు ప్రశ్నించారు. భాజపాతో ఉంటారా, మోడీతో వెళ్తారా… లేకపోతే ఎటొస్తారు అని అడుతున్నా అన్నారు. కేసీఆర్ కి, ఎమ్.ఐ.ఎమ్.కి ఓటేస్తే… పరోక్షంగా మోడీకి ఓటేసినట్టే అన్నారు.