పునర్విభజన చట్టంలోని అంశాలు, విభజన తర్వాత కూడా 10 సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇబ్బందులపై సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రజా భవన్ లో జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నుండి ముగ్గురు మంత్రులు, సీఎస్ లు, అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఏపీకి హైదరాబాద్ లో కొన్ని బిల్డింగులు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ ను కోరగా, స్థిరాస్థి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలపై రెండు రాష్ట్రాల అధికారులు బెట్టు చేయగా… అధికారులు వారి వారి రాష్ట్రాల వాదనలు వినిపించారు. దీనిపై మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య అధికారుల స్థాయిలో ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో మరో కమిటీ వేసుకోవాలని… సమస్యలు పరిష్కరించుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఇక తెలంగాణ తలపెట్టిన మూసీ బ్యూటిఫికేషన్, మహిళలకు ఫ్రీ బస్ పథకంపై సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఆరా తీసినట్లు సమాచారం.
ఇక తెలంగాణ నుండి ఏపీలో కలిపిన పోలవరం ముంపు ప్రాంతాల నుండి 5 గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై ఏపీ సానుకూలంగా స్పందించింది. ఇరు రాష్ట్రాల తరఫున కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.