గర్జన ప్రభావమో… ఆ సందర్భంగా ఉద్యమం దారితప్పి హింసగా మారిన ప్రభావమో తెలియదు గానీ.. కాపు రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ ప్రస్తుతం పతాకస్థాయిలో ఉన్నది. ఈ కీలక సమయంలో చంద్రబాబునాయుడు ఒక అత్యంత ప్రధానమైన చర్చకు తెరతీశారు. కాపులను బీసీల్లో చేరుస్తూ తక్షణం జీవో విడుదల చేసేయాలా? లేదా శాస్త్రీయ పద్ధతిలో కమిషన్ ద్వారా అధ్యయనం చేసి.. ముందుముందు న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా చేయాలా? అనే మీమాంసను కాపు నాయకుల విజ్ఞతకే వదిలిపెట్టారు. మంగళవారం నాడు మధ్యాహ్నం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాపు నాయకులతో ఆయన ఈ మేరకు ఒక సమావేశం పెట్టుకుని, వారందరి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చినా రాకపోయినా, మీడియా లేదా బహిరంగ లేఖల రూపంలో అయినా సరే కాపుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు కూడా ఈ విషయంలో తమ నిర్దిష్టమైన అభిప్రాయాన్ని బహిరంగపరచవలసిన కీలకమైన తరుణం ఇది.
జాట్లను బీసీల్లో చేర్చడాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసినట్లుగా కాపుల పరిస్థితి కూడా తయారు కాకుండా ఉండడానికి, శాస్త్రీయ బద్ధమైన అధ్యయనం ద్వారా వారిని బీసీలు చేయడానికి తాను ప్రయత్నం చేస్తూఉండగా.. విపక్షాలు దాన్ని రాజకీయం చేస్తూ తప్పుపడుతున్నాయనేది చంద్రబాబునాయుడు ఆవేదన! అయితే కమిషన్ అనేది కాలయాపన అని ఆయన ప్రత్యర్థులు వాదిస్తున్నారు. కాపు ఉద్యమం ఇంత ముదిరిన తర్వాత.. ప్రత్యర్థుల వాదనను కూడా చంద్రబాబు కాదనడం లేదు. మీరు చెప్పినట్లు చేయడానికి కూడా రెడీ..! తక్షణం జీవో ఇచ్చేస్తా.. కోర్టులు దానిని కొట్టివేస్తే.. నన్ను నిందించకుండా మీరు బాధ్యత వహిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.
కాపులు రాష్ట్రంలో ఒక పెద్ద కులంగా ఉన్నారు గనుక.. వారి ప్రాపకాన్ని సంపాదించుకోవడానికి ప్రతి పార్టీ కూడా అత్యుత్సాహపడడం సహజం. కాపులు ఇప్పుడు ఉద్యమిస్తోంటే.. సహజంగా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది. విపక్షాలు అన్నీ కాంగ్రెస్, వైకాపాలు ఆ ఉద్యమానికి బహిరంగ మద్దతు ఇస్తూన్నారు. ఇందులో ఎలాంటి తప్పులేదు. అయితే కేవలం కాపుల విషయాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవడం కోసం చూడకుండా నిజంగా సమస్య పరిష్కారాన్ని కోరుకునే ప్రతి పార్టీకి చెందిన ప్రతి నాయకుడు కూడా ముద్రగడ పద్మనాభం అయినా, జగన్ అయినా, రఘువీరారెడ్డి అయినా, చిరంజీవి అయినా.. ఈ పార్టీల్లోని కాపు ప్రముఖులు అయినా ఎవరైనా సరే.. జీవోనా? అధ్యయనమా? అనే విషయంలో తమ తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. బాబుకు చెప్పడం తమకు చిన్నతనంగా భావిస్తే.. బహిరంగ లేఖల రూపంలో ప్రజల ముందు తమ అభిప్రాయాలు విస్పష్టంగా ఉంచాలి. అలా చేయకుండా.. చిచ్చు ఎంతవరకు రగులుతుందో చూద్దాం.. ఆ తర్వాత.. ప్రభుత్వాన్ని ఎలా నిందించవచ్చునో ఆలోచిద్దాం అనుకుంటూ గడిపితే అది చాలా పెద్ద సామాజిక ద్రోహం అవుతుంది.