రాజకీయాల్లో ‘పునాదులు’ గురించి మాట్లాడేవారు ఎక్కువ ఉంటారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రీతిలో వారసత్వ రాజకీయాలే రాజ్యమేలుతున్న రోజులవి. కాబట్టి, ముందు తరాలు వేసిన పునాదులపై ప్రస్తుతం అధికారం వెలగబెడుతున్న నేతాగణం చాలామందే ఉన్నారు. అయితే, పునాదుల గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎందుకో నచ్చినట్టుగా లేదు! కర్నూలు జిల్లాలో సోమవారం నాడు ఒక అనూహ్యమైన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఎదురైంది.
జిల్లాలోని ముచ్చుమర్రి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వైకాపా ఎమ్మెల్యే ఐజయ్యకు కూడా వేదికపై మాట్లాడే అవకాశం ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. ఐజయ్య మాట్లాడటం మొదలుపెట్టేసరికి చంద్రబాబుకు చెమటలు పట్టినంత పరిస్థితి వచ్చింది. ఐజయ్య మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టుకు పునాదులు వేసింది మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఇదే కాదు… పోలవరం ప్రాజెక్టు కూడా వైయస్సార్ హయాంలోనే పునాదులు పడ్డాయని ఆయన చెప్పారు. అంతే.. వెంటనే చంద్రబాబు కల్పించుకున్నారు. పునాదులు వేసేవాళ్లు, వేసి వెళ్లిపోవాళ్లు చాలామందే ఉంటారనీ, తాను వచ్చింది రాజకీయాలు మాట్లాడేందుకు కాదనీ, వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే ఇక్కడికి వచ్చానని ఐజయ్య మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నారు. ఆయన మైక్ కూడా కట్ చేశారు.
పునాదుల గురించి మాట్లాడితే చంద్రబాబుకు ఎందుకంత ఉలికిపాటు అనేది పలువురి ప్రశ్న! తెలుగుదేశం పార్టీకి పునాదులు వేసింది ఎన్టీఆర్ కదా.. ఆయన గురించి కూడా చంద్రబాబు ఎన్నోసార్లు గొప్పగా చెబుతుంటారు కదా. పునాదులు వేసేవారు వస్తుంటారూ.. పోతుంటారు అంటే… పునాదులు వేసినవారి గురించి మాట్లాడకూడదనేది చంద్రబాబు అభిప్రాయం కావొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం గొప్పగా చెప్పుకుంటున్న పోలవరం కావొచ్చు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు కావొచ్చు… వైయస్సార్ హయాంలో వీటితోపాటు చాలావాటికి పునాదులు పడ్డాయి. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి పూర్తి చేస్తోంది. అధికారంలో ఉన్నవారి బాధ్యత అది.
ఇప్పుడు తెలుగుదేశం పునాదులు వేసి వదిలేసిన ప్రాజెక్టుల్ని తరువాత అధికారంలోకి వచ్చేవారు పూర్తి చేయాల్సిందే కదా! ప్రాజెక్టులు అనేవి ప్రజలం కోసంగానీ… రాజకీయ పార్టీల సాధించిన విజయాల కోసం కాదు కదా! పునాదులు వేసినవారికి గుర్తు చేసుకున్నంత మాత్రాన తప్పుగా భావిస్తే ఎలా..?