ఓటమి భయంతోనే… ఈవీఎంలపై.. ఆరోపణలు చేస్తున్నారని.. ఇతర పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలను.. చంద్రబాబు తిప్పికొట్టారు. ఏపీలో అధికారం మాదే…భారీ మెజార్టీతో టీడీపీ గెలవబోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 110 నుంచి 140 సీట్లు గెలుస్తామని ప్రకటించారు.
ఈవీఎంలపై పోరాడుతుంటే ఓడిపోతున్నామని ప్రచారం చేస్తున్నారని… ఎన్నికల వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందనే మా పోరాటమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయం అంటే డబ్బుతో నడుస్తుందన్న భ్రమ కల్పిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎన్నికలు అత్యంత దారుణంగా నిర్వహించినందునే.. కుట్రలకు పాల్పడినందునే.. పోరాటం చేస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని నెదర్లాండ్స్ తీర్మానించిందని.. గుర్తు చేశారు. ఏ ఓటు ఏ ప్రాంతంలో నమోదైంది చెప్పడానికి వీల్లేదని.. ఐరోపా దేశాలు ఈవీఎంలను వద్దనుకున్నాయన్నారు.
సీఈసీ తీరుపై.. చంద్రబాబు గుస్స ా్య్యారు. ఎన్నికల కమిషనర్‌కి టెక్నాలజీపై ఉన్న అవగాహన ఎంత? ఏ ప్రాతిపదికన ఆయన వాదిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో.. ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్స్ ఏంటో నా కంటే బాగా వీళ్లకి తెలుసా? అని మండి పడ్డారు. దేశంలో ఎవరికీ అర్థంకాని రోజుల్లోనే.. ఈ-సేవ లాంటివి ప్రవేశపెట్టిన నాయకుడిని తానన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఈసీ బుకాయించడం సరికాదని చెబుతున్నారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేశారని… కాంగ్రెస్ నేతలు ఎంత పోరాడినా లాభం లేదు..సారీ చెప్పి ఊరుకున్నారన్నారు. అలాగే ఢిల్లీలో 30 లక్షల ఓట్లు తీసేశారని.. ఏపీలోనూ ఫామ్-7 వాడి ఓట్లు తీసేయాలని కుట్రలు చేశారని గుర్తు చేశారు. జాగ్రత్త పడ్డాం కాబట్టి సరిపోయింది లేకుంటే ఇక్కడా అదే జరిగేదని చంద్రబాబు జోస్యం చెప్పారు. 7 లక్షల 50 వేల ఓట్లు తీసేసేందుకు ఫామ్-7 ఇచ్చారని సీఈవో ఒప్పుకున్నారని.. మేం ఐపీ అడ్రస్‌లు అడిగితే ఇప్పటికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈసీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అనేందుకు.. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని చంద్రబాబు ప్రశ్నించారు.
చంద్రబాబు ఈవీఎంపై పోరాటం చేస్తూండటంతో.. వైసీపీ నేతల్లో లేని ధైర్యం వస్తోంది. ఓడిపోతారన్న ఉద్దేశంతోనే.. చంద్రబాబు ఈ పోరాటం చేస్తున్నారని..వారు నమ్ముతున్నారు. నిజానికి ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు ఇక మారే అవకాశం లేదు. ఎలాంటి ప్రచారం జరిగినా ఇబ్బందిలేదు. ఆ ఉద్దేశంతోనే.. ఇక జాతీయ స్థాయిలో ఏపీలో అమలు చేసిన వ్యూహాలు ఇంకెక్కడా బీజేపీ నేతలు అమలు చేయకూడదన్న లక్ష్యంతో.. చంద్రబాబు..ఈవీఎంలపై పోరాటం చేస్తున్నారు. ఈ పోరాట ఫలితంగా.. ఈసీపై ఒత్తిడి పెరుగుతోంది. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. చంద్రబాబు వ్యూహం కూడా ఇదే.