ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చిన రెగ్యూలర్ బెయిల్ ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీకి వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాది సమయం కోరారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వీలైనంత త్వరగా విచారణ తేదీ ఖరారు చేయాలని కోరారు. దీంతో ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ప్రకటించింది.
చంద్రబాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలను కోర్టుకు ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని హైకోర్టు అభిప్రాయపడింది. స్కిల్ ప్రాజెక్టులో దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయని చెప్పడానికి ఆధారాలు లేవని తెలిపింది. రిమాండ్ కు ముందే ఆధారాలు చూపించాల్సి ఉండాల్సిందని, అందకే, దర్యాప్తులో లోపంగా భావిస్తూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తున్నామని వెల్లడించింది. అయితే విచారణ దశలో ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించకూడదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు అంటున్నారు.
మరో వైపు చంద్రబాబు తనపై కేసు అక్రమం అంటూ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో విస్తృత ధర్మాసనానికి వెళ్లింది. ఆ ధర్మాసనాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు.