తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేసినా ప్రపంచ స్థాయి అంటారు. తను చేపట్టిన పని గురించి ప్రపంచమంతా చర్చ జరగాలని ఆయన చెబుతుంటారు. ఇందుకోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసేయడంలో బాబుకు ఎలాంటి మొహమాటమూ లేదు. తాజాగా ఆయన పుష్కరాల విషయంలో చేసిన ప్రసంగం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరీ ఎందుకు ఇంత ప్రచార ఉబలాటం అనేది అర్థం కాదు. ఇంతకీ బాబుగారు ఏమంటారంటే.. కృష్ణా పుష్కరాల గురించి ప్రపంచమంతా చర్చించుకోవాలట. పుష్కరాల ఆరంభం ఆ స్థాయిలో అదిరిపోవాలట.
మరి పుష్కరాలు అంటే.. ఒక ప్రాంతానికి పరిమితం అయినవి. బాబుగారి ఆరాటం మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. సూటిగా మాట్లాడితే.. గోదావరి పుష్కరాలైనా, కృష్ణా పుష్కరాలు అయినా.. కొన్ని జిల్లాలకు సంబంధించినవే. ఏపీలోనే అనంతపురం , చిత్తూరు వంటి జిల్లాల నుంచి ఈ పుష్కర స్నానానికి ఎంత మంది వస్తారో.. ఆయా జిల్లాల వారికే తెలుసు. ఇప్పుడంటే టీవీల్లో పేపర్లలో ఈ పుష్కర వార్తలను గట్టిగా రాస్తున్నారు కాబట్టి.. వాటి గురించి సామాన్య ప్రజానీకానికి అంతో ఇంతో అవగాహన వస్తోంది. లేకపోతే.. పుష్కర స్నానం చేయడం పవిత్రం దాని కోసం ఆయా నదుల వరకూ వెళ్లవచ్చనే విషయం ఈ జిల్లాల వారీకి తెలిసేదే కాదు.
ఆయా నదీ పరివాహిక ప్రాంతాల వారికి మాత్రం పుష్కరాల పట్టింపులు ఎక్కువ ఉంటాయి. వాస్తవాలు ఇలా ఉంటే.. బాబుగారి మాటలు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవం చూసి.. ప్రపంచమంతా అమరావతికి గుర్తింపు రావాలట! దేశంలో ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరం వస్తూనే ఉంటుంది. వాటిని మనమెంత మాత్రం పట్టించుకుంటున్నాం? ఎంత గ్రాండ్ గా , ఎంత జనసందోహంతో ఆయా నదులకు పుష్కరాలు జరుగుతున్నా.. ఎంతమంది హిందువులకు వాటి మీద అవగాహన ఉంది. కృష్ణా పుష్కరాలు అయినా అంతే కదా.. మరి ఈ మాత్రం దానికి ఇంత ప్రచార ఉబలాటం, కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు?