స్టార్ మార్కెట్లో ఇప్పుడు ఏపీకి చెందిన కంపెనీలు హాట్ ఫేవరేట్ గా ఉన్నాయి. వాటి షేర్లు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. ఊహించనంతాగ పెరిగిపోతున్నాయి. ఇందులో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కూడా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటించినప్పటి నుండి ఈ ర్యాలీ సాగుతోంది.
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి హెరిటేజ్ కంపెనీ షేర్ ఏకంగా 53 శాతం పెరిగింది. బెట్టింగులు పెట్టడం కన్నా చంద్రబాబుపై నమ్మకంతో హెరిటేజ్ షేర్లు కొన్నవాళ్లు బీభత్సంగా లాభపడ్డారు. ఇప్పటికీ ఆ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. ఇక పెన్నార్, ఏపీఆర్, అమరరాజా వంటి కంపెనీల షేర్లు 30 శాతానికిపైగా పెరిగాయి. ఇవి మాత్రమే కాదు.. ఏపీకి సంబంధించిన ప్రతి లిస్టెడ్ కంపెనీకి మంచి రోజులు వచ్చాయి భారీగా షేర్లు పెరుగుతున్నాయి.
సాధారణంగా ఏపీలో టీడీపీ గెలిస్తే.. ఆ సెంటిమెంట్ తో ఒక్క హెరిటేజ్ షేర్లు కొంటారేమో కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు స్టైల్ రాజకీయంపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న మదుపరులు మంచి రోజులు వస్తాయని నమ్మకంతో షేర్లుకొని పెట్టుకుంటున్నారు. అయితే కరెక్షన్ ఉంటుందన్న హెచ్చరికలు కూడా మార్కెట్ నిపుణుల నుంచి వస్తున్నాయి.