తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. బాలకృష్ణ తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారనీ, ఇప్పటికీ దీన్ని నమ్మలేకపోతున్నాననీ, ఆయన ఫ్యాన్ కి ఉరేసుకోవడమేంటని చంద్రబాబు అన్నారు. సమస్యలు వస్తుంటాయనీ, వాటిపై పోరాడదామని తాను అనేకసార్లు చెప్పానన్నారు. ఎక్కడో తనకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయాడనీ, దాన్ని భరించలేక తనకు నిద్రపట్టడం లేదని రెండు మూడుసార్లు కోడెల చెప్పారన్నారు. ఇవన్నీ కావాలని జరుగుతున్నాయనీ, ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండి ఎదుర్కొంటేనే కార్యకర్తలకు కూడా ఒక నమ్మకం కలుగుతుందని చెప్పానన్నారు.
కానీ, ఏం జరిగిందో… తనని భగవంతుడు ఏ మూడ్ లో తీసుకుపోయాడో, ఈ అగత్యానికి పాల్పడ్డాడు అని చంద్రబాబు అన్నారు. చాలా బాధేస్తోందనీ, ఏనాడూ రాజీపడని సహచరుడనీ, ఎలాంటి ఇబ్బందులొచ్చినా ఏస్థాయి సంక్షోభాలు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొన్నాడన్నాడు. కానీ, ఈ అవమానాన్ని ఫేస్ చెయ్యలేకపోయాడన్నారు. దీనికి కారణం…. ప్రజలందరూ చర్చించాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కాదన్నారు. మామూలుగా చనిపోతే ఫర్వాలేదనీ, ఇది బాధాకరమైన సంఘటన అనీ, ఒక మనిషి అవమానం భరించలేక… అదీ ఒక డాక్టర్ గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడమనేది ఇంకా నమ్మకలేకపోతున్నా అన్నారు. ఎంత మానసిక క్షోభ గురైతేనే ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుని ఉంటారన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని మరోసారి చెప్పి, ఇంతకుమించి తాను చెప్పేది లేదన్నారు.
కోడెల ఆత్మహత్యకు కారణం భరించలేని అవమానమే అని పదేపదే చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు. కోడెల అనుభవించిన మానసిక క్షోభకు కారణమైన పరిస్థితులు ఏంటో అందరికీ తెలిసివే. అందుకే, వాటిపైనే చర్చ జరగాలని ఒకటికి రెండుసార్లు చెప్పారు. నిజానికి, ఆ పరిస్థితులపై చర్చ అవసరం. ఎందుకంటే, రాజకీయాల్లో కక్ష సాధింపులు హద్దు మీరుతోందేమో అనే పరిస్థితి కనిపిస్తోంది. తప్పులుంటే శిక్షించాలి, చట్టపరమైన చర్యలకు పరిమితం కావాలి. ఆ పరిధి దాటుతోందేమో అనే అనుమానాన్ని చంద్రబాబు నాయుడు పరోక్షంగా వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన మాటలున్నాయి.