మూడు రోజుల నుంచి పోలింగ్ బూత్‌ల వారీగా.. సమాచారాన్ని సేకరించిన చంద్రబాబు.. .. తెలుగుదేశం పార్టీ 120స్థానాలు గెలవబోతోందన్న అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు. పోటీ చేసిన 175 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, 25 నియోజకవర్గాల పార్లమెంట్ అభ్యర్థులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రకాల సర్వేలు క్షేత్ర స్థాయి సమాచారం తీసుకున్న తర్వాతే.. 120సీట్ల లెక్క చెబుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ నెల ఇరవై రెండో తేదీన అందరూ అమరావతికి రావాలని ఆదేశించారు. ఆ రోజున అభ్యర్థులందరితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈనెల 23 నుంచి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తాననని చంద్రబాబు తెలిపారు.
టెలీకాన్ఫరెన్స్‌లో పలువురు అభ్యర్థులు.. తమకు ఎదురైన ఇబ్బందుల గురించి వివరించారు. పీలేరులో ఎన్నికల కమిషన్…ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని చెప్పిన కిశోర్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే ఎన్నికల కమిషన్‌పై పోరాడుతున్నానని చంద్రబాబు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత… పోలైన ఓట్ల వివరాలతో బూతుల్లో ఏజెంట్లకు ఇచ్చే ఫామ్-17 గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ డాక్యుమెంట్లన్నింటినీ జాగ్రత్త చేయాలని ఆదేశాలించారు.
ఈవీఎంలపై పోరాటం పేరుతో.. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు.. టీడీపీ నేతల్లో గందరగోళానికి దారి తీశాయి. ఓటమికి కారణాలు వెదుక్కుంటున్నారేమో అనే అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. అదే సమయంలో వైసీపీ నేతలు.. గెలవబోతున్నామని.. హడావుడి ప్రారంభించారు. నేమ్‌ప్లేట్, మంత్రివర్గం అంటూ.. వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు… అన్నిరకాల విశ్లేషణలు చేసుకుని టీడీపీకి 120 సీట్లకుపైగా వస్తాయని లెక్క చెప్పడంతో.. టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కాస్త ధైర్యం తెచ్చుకున్నారు.