ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే.. దేశంలో రెండో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి అమిత షా. ఆయన పుట్టిన రోజు నేడు. మరి శుభాకాంక్షలు వెల్లువెత్తకుండా ఉంటాయా ? తెలుగు రాష్ట్రాల నుంచీ అలాగే పెద్ద ఎత్తున చెప్పారు. సోషల్ మీడియా వచ్చాక.. అందరికీ ఫేస్ బుక్ లేదా.. ట్విట్టర్లో పోస్టు పెట్టడంతో పనైపోతోంది.నేరుగా విషెష్ చెప్పడం లేదు. అమిత్ షాకూ అంతే. సీఎం జగన్ ట్వీట్ శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు కూడా ట్వీట్ పెట్టారు. అంతటితో సరి పెట్టుకోలేదు. నేరుగా అమిత్ షాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.
ఫోన్ చేసిన తర్వాత మాట్లాడుకోకుండా ఉంటారా అన్న ఊహాగానాలకు చాన్స్ ఇచ్చారు. ఇటీవల ఏపీలో మారిపోయిన రాజకీయ పరిణామాల కారణంగా చంద్రబాబు.. అమిత్ షాకు ఫోన్ చేశారంటే… కొత్త సమీకరణాలు ప్రారంభమవడం ఖాయమే. అందుకే.. చంద్రబాబు అమిత్ షాకు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారని.. టీడీపీ వర్గాలు కూడా మీడియాకు సమాచారం ఇచ్చాయి. అయితే తాము టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని.. జనసేన కూడా తమతోనే ఉంటుందని సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు చెబుతున్నారు. కానీ.. ఢిల్లీ పెద్దల ఆలోచన ఏమిటో కానీ.. వారితో పరిచయాలు పెంచుకునేందుకు చంద్రబాబు మాత్రం.. తన రాజకీయం అంతా చూపిస్తున్నారు.
2014 పొత్తులు రిపీట్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. కానీ టీడీపీ వర్గాలు.. చివరికి జనసేన క్యాడర్ కూడా కూటమిలోకి బీజేపీ వద్దని.. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి వైసీపీకి ఎలాంటి సహకారం అందించారో.. ఇప్పుడు తమకూ అలాంటి సహకారం అందివ్వాలని కోరుకుంటున్నారు. మరి ఈ ఫోన్ పలకరింపుల రాజకీయాలు ఎటు దారి తీస్తాయో ముందు ముందు వెల్లడవుతుంది.