నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మన కష్టంతో నిర్మించుకుందామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ అప్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. అప్పు రూపంలో ప్రభుత్వానికి సొమ్ము ఇస్తే బాండ్లు ఇస్తామన్నారు. బ్యాంకుల కంటే అదనంగా రెండు లేదా మూడు శాతం వడ్డీ కూడా ఇస్తామన్నారు. దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు. ప్రవాసాంధ్రులతోపాటు, ఆంధ్రా ప్రయోజనాలు కోరుకునే ప్రతీ ఒక్కరూ రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు. రాజధానికి కావాల్సిన భూమిని సమీకరణ పద్ధతిలో రైతులు ఇచ్చారనీ, అదే తరహాలు నిధుల సమీకరణ కూడా జరగాలన్నారు. కేంద్రం మనకు సహకరించకపోయినా, కష్టపడి ఫలితాలను సాధించుకుందాం అన్నారు.
ప్రభుత్వాలు ప్రజలకు బాండ్లు ఇవ్వడం అనేది సాధారణ ప్రక్రియ. ప్రజల నుంచి సొమ్ము సేకరించాల్సిన సందర్భాలు ఇలానే బాండ్లు ఇస్తారు. అయితే, ప్రస్తుతం చంద్రబాబు కోరుతున్నది.. రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి అప్పులు! అంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణ సాధ్యమా అనేదే ప్రశ్న..? ఎందుకంటే, మూడేళ్ల కిందట ఇలానే ‘నా ఇటుక, నా అమరావతి’ అనే కార్యక్రమం చేపట్టారు. రాజధాని కోసం ఇటుకలు అమ్మితే.. అరకొర స్పందనే వచ్చింది. ఆశించిన స్థాయిలో విరాళాలు రాలేదు. ఇంకోటి.. రైతులు భూములు ఇచ్చిన తరహాలోనే ఇప్పుడు ప్రజలు అప్పులివ్వాలంటున్నారు! నిజానికి, రైతులు ఇచ్చిన 35 వేల ఎకరాల భూములు ఎప్పటికి లాభదాయంగా మారుతాయనేది ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది. ప్రజలే భూములిచ్చి, రాజధాని నిర్మాణానికి కూడా ప్రజలే అప్పు రూపంలో ప్రభుత్వానికి నిధులు ఇవ్వాలంటే ఎలా..? అన్నీ ప్రజల నుంచే సేకరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకూ, ఆపై కేంద్రం ఎందుకు ఉన్నట్టు..? వాస్తవానికి, ప్రభుత్వాలు ఖర్చు చేసే నిధులు కూడా ప్రజల నుంచి వివిధ పన్నుల రూపంలో సేకరించినవే కదా.
కేంద్రంలో టీడీపీకి అనుకూలమైన సర్కారే ఉన్నా కూడా గడచిన నాలుగేళ్లలో రాజధానికి నిధులు రాలేదు. 2019 ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చేది, ఆంధ్రాకు అనుకూలమైన పార్టీయే అవుతుందన్న గ్యారంటీ లేదు. లేదా, మరోసారి మోడీ అధికారంలోకి వస్తే… ఆంధ్రాపై ఆయన దృక్పథం సానుకూలంగా మారిపోతుందా అనేదీ చెప్పలేం. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వచ్చే వాతావరణం లేదు కాబట్టి… ప్రజల నుంచి అప్పులు తీసుకోవడం సరైన నిర్ణయమా అనేది చర్చనీయాంశం. రాజధాని నిర్మాణానికి కేంద్రంతో పోరాడి నిధులు సాధించుకోవాలి. అంతేతప్ప, ఇలా ప్రజలు ఇచ్చే అప్పులు మీద ఆధారపడాలని అనుకుంటే… అరకొర నిధులే సమకూరుతాయి.