ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుండి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గోబోతున్నారు. ఆయన వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం, గ్రేటర్ ఎన్నికల బాధ్యతని తెలంగాణా తెదేపా నేతలకే అప్పగించడం వంటివి ఆయన తెలంగాణాలో తన పార్టీని పట్టించుకోవడం లేదనే తప్పుడు సంకేతాలు పంపినట్లవడంతో, ఆయన కొన్ని రోజుల క్రితం తెదేపా-బీజేపీలు కలిసి నిజాం కాలేజి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మళ్ళీ రేపటి నుండి ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గోబోతున్నారు. పార్టీకి మంచి పట్టు ఉన్న కూకట్ పల్లి, మల్కాజ్ గిరి వంటి ప్రాంతాలలో ప్రచారం చేస్తారని సమాచారం. రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఆయన ప్రచారం మొదలుపెడతారు. వీలుంటే ఒక బహిరంగ సభ కూడా నిర్వహించవచ్చని తెలుస్తోంది.