నవ్యాంధ్ర రాజధాని నిర్మాణమే ఎజెండాగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది. 17 నెలలుగా ఇతర పనులు పెద్దగా జరగడం లేదు. దసరా నాడు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా నిర్మాణాలు జరపాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అలాగే క్రమంగా ప్రభుత్వ కార్యాలయాలను, సిబ్బందిని కూడా వీలైనంత త్వరగా తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చంద్రబాబుకు హైదరాబాద్ లో ఉన్న ఇంటిని కూల్చేసి విశాలమైన భవంతి నిర్మాణానికి ప్లాన్ చేశారు. ఇప్పుడిది ఉమ్మడి రాజధాని. పదేళ్ల తర్వాత పొరుగు రాష్ట్ర రాజధాని. మరి నవ్యాంధ్ర రాజధానిలో చంద్రబాబు సొంతిల్లు కట్టుకోరా?
సిబ్బందిని వీలైనంత త్వరగా తరలి రమ్మంటున్నారు. వచ్చే ఏడాది జూన్ 2 వరకు నవ్యాంధ్రకు తరలిన ప్రజలే స్థానికులు అని చెప్తున్నారు. నారావారి పల్లెలో చంద్రబాబుకు సొంతిల్లు ఉన్న మాట నిజమే. అసలు రాజధాని సమీపంలో ఓ ఇంటి నిర్మాణం ఇప్పుడు వీలైనంత త్వరగా చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిస్తే బాగుంటుందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో ఇంటి నిర్మాణానికి ప్లాన్ చేయడం, అనుమతి రాలేదని ఆవేదన చెందడం అందరికీ తెలిసిందే. అమరావతి పరిధిలో స్థలం కొనుక్కుని ఇంటిని నిర్మించుకునే ఆర్థిక స్తోమత చంద్రబాబుకు ఉంది. మొన్న లోకేష్ చెప్పిన లెక్కల ప్రకారం చూసినా ఇది చంద్రబాబుకు భారం ఏమీ కాదు. ఈ పనిచేస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుంది. అవసరమైతే చెట్ల కింద కూర్చుని పని చేస్తామని ఆ మధ్య ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. ఇప్పుడు నవ్యాంధ్రకు తరలే విషయంలో అంత స్పష్టత కనిపించడం లేదు. చంద్రబాబే చొరవ తీసుకుని నవ్యాంధ్ర రాజధాని నివాసిగా మారితే అందరికీ స్ఫూర్తినిస్తుందేమో ఆలోచించాలి.
నవ్యాంధ్రకు నిధుల కొరత ఉంది. కేంద్రం ఏ స్థాయిలో ప్యాకేజీ ఇస్తుందో తెలియదు. రాజధానికే కాదు, రోజూ వారీ అవసరాలకు కూడా నిధుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు వీలైనంత పొదుపు పాటించాలి. చంద్రబాబు విమానాల ఖర్చే వంద కోట్లయిందని జేపీ విమర్శించారు. అంత ఖర్చు అవసరమా? విమానాలు, హెలికాప్టర్లు, హోటళ్లు ఇతరత్రా జల్సాగా ఖర్చు పెట్టడాన్ని ఇకనైనా మానుకుంటారా? సంపన్న రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం లేదు. కాబట్టి చంద్రబాబు, మంత్రివర్గ సహచరులు ఇక ముందైనా పొదుపు పాటించి ప్రజాధనాన్ని వీలైనంత వరకు ప్రజల అవసరాల కోసమే ఖర్చు పెడతారేమో చూద్దాం.