మూడు రాజధానులపై రిఫరెండం పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు .. సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి సవాల్ చేశారు. మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని తేలితే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆఫర్ కూడా ఇచ్చారు. రాజధాని ఉద్యమం ప్రారంభమై ఏడాది అయిన సందర్భంగా నిర్వహించిన జనభేరీ బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ను ఫేక్ సీఎంగా అభివర్ణించారు. ముందుగా అమరావతిని రాజధానిగా ఒప్పుకుని ఇప్పుడు మాట మార్చారని అందుకే ఫేక్ సీఎం అని చంద్రబాబు ప్రకటించారు. మాయ మాటలు నమ్మి ప్రజలు గెలిపించారని.. ఇంత పనికిమాలిన దద్దమ్మ ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని విమర్శించారు. జగన్ ను వన్ టైమ్ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే పద్దెనిమిది నెలల పాటు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చారు.. సాక్షాత్తు పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. ఒక కులంలో పుట్టడం నా తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు. కులం చూసి హైదరాబాద్, విశాఖను అభివృద్ధి చేయలేదన్నారు.
అమరావతి జనభేరీ సభకు పోలీసులు అనుమతి ఇచ్చినా అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. సభా ప్రాంగణం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మధ్యలో చంద్రబాబు రూట్ మార్చుకున్నారని.. తాము అంగీకరించబోమన్నారు. కాలి నడకన చంద్రబాబు ఉద్దండరాయుని పాలెంలో అమరావతి శంకుస్థాపన వేదిక వద్దకు వెళ్లారు. అక్కడ శంకుస్థాపన ప్రాంతానికి సాష్టాంగ ప్రమాణం చేసి సభా వేదిక వద్దకు వచ్చారు. మరో వైపు జిల్లాల నుంచి ఇతర పార్టీల నేతలు.. కార్యకర్తలు.. ప్రజా సంఘాల నేతలు ఎవరూ అమరావతి సభకు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. హౌస్ అరెస్టులు చేశారు. చివరికి కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలను కూడా రాకుండా అడ్డుకున్నారు.
జనభేరీ సభకు… అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ తరపున పాతూరి నాగభూషణంతో పాటు మరో నేతను పంపించారు. సీపీఎం మాత్రం ఎవర్నీ పంపలేదు. బీజేపీతో సభను పంచుకోమంటూ సమాచారం పంపింది. అయితే అమరావతి ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చింది. అన్ని ప్రాంతాల నుంచి నేతలు.. అమరావతి సభలో పాల్గొన్నారు. రాయలసీమకు చెందిన తులసీరెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు సహా అందరూ.. అమరావతిని అందరి రాజధానిగా ప్రకటించారు. రాష్ట్రం కోసం.. ఒకే రాజధాని ఉండాల్సిన అవసరం ఉందన్నారు.