ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థిని కట్టడి చేసే వ్యూహాలు పన్నడంలో దిట్ట. ఆయనపై వచ్చినన్ని ఆరోపణలు దేశంలో ఏ రాజకీయనాయకుడిపైనా రాలేదు. అయినా ఏ ఒక్క ఆరోపణా నిరూపణ కాలేదు. అయ్యే అవకాశమూ లేదు. ఎందుకంటే ఆయన సిస్టమ్‌ను పక్కాగా ఫాలో అయ్యే వ్యక్తి కావడం. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తీరు ఆయన వ్యూహ చతురతకు మచ్చు తునక. ఎవరికీ అంతుపట్టని విధంగా ఆయన పన్నాగాలు పన్నుతారు. ఇక్కడ పన్నాగమంటే దురర్థమేమీ లేదు. ప్రత్యర్థిని పడగొట్టే వ్యూహం ప్రతీదీ పన్నాగమే. తాజాగా అలాంటి పన్నాగమే పన్నారు చంద్రబాబు. ఈసారి దానికి బలైందీ వైయస్ జగన్మోహన్ రెడ్డే. ఒక రకంగా చెప్పాలంటే సాలెగూడులో చిక్కుకున్న ఈగలా ఆయన పరిస్థితి తయారైంది. సాలెగూడులాంటి సోషల్ మీడియానే వేదిక చేసుకుని చంద్రబాబు పటిష్టమైన ప్రణాళిక రచించారు. ముందుగా పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్నూ, రెండు రోజుల క్రితం సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తగా చెప్పుకుంటున్న రవీంద్ర ఇప్పాలను అరెస్టు చేయించారు. కచ్చితమైన సాక్ష్యాధారాలను సేకరించి మరీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఈ తరహా నేరాల్లో అనుసరించాల్సిన పద్ధతులన్నింటినీ తుచ తప్పకుండా పాటించింది. లోకేశ్ లక్ష్యంగా శాసన మండలిని ఇతివృత్తంగా తీసుకుని పెట్టిన పోస్టు తొలి కేసుకు ఆలంబనైంది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితనుద్దేశించి అసభ్యంగా పెట్టిన పోస్టు రెండోది. ఈ రెండు కేసులకూ తిరుగులేదు. వైయస్ఆర్ కాంగ్రెస్‌ను అదుపుచేయడానికీ, దానిపై పై చేయి సాధించడానికి ఇవి ప్రభుత్వానికి వజ్రాయుధాల్లా దొరికాయి.
మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుని తిరిగినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులే కాక నాయకులు కూడా ఆ ఇద్దరికీ ప్రత్యక్షంగా వంతపాడారు. మీ వెంట మేమున్నామంటూ ఇప్పటికీ పోస్టులు పెడుతున్నారు. మొదటి కేసు సంగతెలా ఉన్నా.. రెండోది ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు… ఇప్పట్లో తేలేది కాదు. నాన్ బెయిలబుల్ కేసు. పార్టీని నమ్ముకుని చూపిన అత్యుత్సాహం రవీంద్రను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎప్పటికి బయటపడతాడనేది కాలమే నిర్ణయించాలి. అతనికి మద్దతు పలుకుతూ మరో రెండు రోజులు పోస్టింగులొస్తాయేమో. తరవాత విషయ తీవ్రత తెలుసుకుని వారు కూడా వెనకడుగు వేస్తారు. చంద్రబాబు పన్నిన వ్యూహం కారణంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పక్కదారి పట్టింది. వారు పెడుతున్న ప్రతి ప్రెస్‌మీట్ సోషల్ మీడియాకు సంబంధించినవి తప్ప…కీలకమైన సమస్యలను ప్రస్తావించిన సందర్భముందా. వేసవిలో మంచి నీటి ఎద్దడి కారణంగా ఇబ్బందులు పడుతున్న గ్రామాల పరిస్థితిని అటు అధికార పార్టీగానీ, ప్రతిపక్ష పార్టీగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడెక్కడో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ పత్రికా స్వేచ్ఛ – కార్టూన్లపై ప్రధానికీ, రాష్ట్రపతికీ రాసిన లేఖలను పట్టుకుని ప్రతిపక్షం వేలాడింది. ఇదేనా మీడియా వ్యవహరించాల్సిన తీరు. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ తన వైఖరిని సింహావలోకనం చేసుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకత అనే మత్తు నుంచి బయటపడాలి. వ్యక్తిగత కక్షతో ఆలోచించడం మానాలి. ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేస్తేనే విజయం సాధ్యం. పదేపదే చంద్రబాబు పేరును ప్రస్తావిస్తుండడం వల్ల ఆయనకు ఎనలేని ప్రచారాన్ని తెచ్చిపెడుతోంది సాక్షి మీడియా. ఈ హడావిడిలోనే.. రాజధాని డిజైన్లపై వెలగపూడిలో సింగపూర్ ప్రతినిధుల సమావేశాన్ని మరిచింది. దీన్ని గమనించినట్లు కూడా కనిపించలేదు. అదీ చంద్రబాబు చతురత. ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేసి, విజయం సాధించడంలో ఆయన చాలా దిట్ట. చంద్రబాబును ఎదుర్కొనడానికి మందబలం కాదు… ఉండాల్సింది… మరింకేదో మిస్సవుతున్నారని తెలుసుకోవాలి. కాల్‌మనీ, వనజాక్షి, ఇసుకమాఫియా, చిత్తూరులో ప్రమాదం, ఎర్రచందనం కూలీల కాల్చివేత వంటి సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం ఎంత సునాయాసంగా అధిగమించిందీ గమనించాలి.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి