ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని పదాలు కొన్ని పార్టీలని, నేతలని గుర్తుకు తెస్తుంటాయి. ఉదాహరణకి తెలుగువారి ఆత్మగౌరవం అనే పదం తెదేపాను గుర్తుకు తెస్తే, విశ్వసనీయత వైకాపాని, లౌకికవాదం కాంగ్రెస్ పార్టీని గుర్తుకు తెస్తాయి. ఆ పదాలపై పేటెంట్ హక్కులు తమకే ఉన్నాయని ఆ పార్టీలు భావిస్తుంటాయి. అయితే అవన్నీ నేతి బీరకాయలో నెయ్యి వంటివేనని చెప్పకతప్పదు. మోడీ ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నా తెదేపా పట్టించుకోదు.
రాజకీయాలలో ఉన్నవారికి విశ్వసనీయత ఉండాలని అది కేవలం తనకొక్కడికే ఉందని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా లోపించి అదే. ఆయన చేసే ప్రతీ పనికి అసలు కారణం, కొసరు కారణం వేర్వేరుగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని అందుకే దానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పుకొన్న నోటితోనే, వైకాపా నుంచి తెదేపాలో చేరిన 8మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి వారు దానిని ఉల్లంఘించినట్లయితే వారిపై అనర్హత వేటు వేయడానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పుకొని తనలో ఆ విశ్వసనీయతే కొరవడిందని రుజువు చేసుకొంటారు.
లౌకికవాదంపై తనకే పేటెంట్ హక్కులున్నాయని భావించే కాంగ్రెస్ పార్టీ, దానిని ఒక రాజకీయ అస్త్రంగా భావిస్తుంది తప్ప పూర్తి మనస్పూర్తిగా దానిని అవలంభించదు. అవసరమయినప్పుడు తన లౌకికస్త్రాన్ని బయటకు తీసి తన రాజకీయ ప్రత్యర్ధి అయిన మతత్వ భాజపాపై ప్రయోగిస్తుంటుంది. ఇలాగ ప్రతీ పార్టీని, చాలా మంది నేతలను గుర్తు చేసే పదాలు చాలానే ఉన్నాయి.
ఇక విషయంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డికి స్వంతమనుకొన్న విశ్వసనీయతని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా క్లెయిం చేసుకొంటున్నారు. పారిశ్రామిక వేత్తలు ఆయనను విశ్వసించడం లేదు కనుకనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని ప్రతిపక్ష పార్టీలు, చివరికి తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విమర్శిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి సంగతి చెప్పనవసరమే లేదు. అవకాశం దొరికిన ప్రతీసారి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనల గురించి, దాని వలన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు. నిన్న శాసనసభలో కూడా మళ్ళీ ప్రశ్నించారు. దానికి జవాబుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు చాలా విశ్వసనీయత ఉందని చెప్పుకోవడం విశేషం.
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తున్నప్పుడు, తన విస్వసనీయత కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు జవాబు చెప్పడం విచిత్రంగా ఉంది. ఆ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడి చేసారు. తను దేశవిదేశాలన్నీ తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించుకొని వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తన ప్రతిష్టను, రాజధాని అమరావతి, రాష్ట్ర ప్రతిష్టను మంట గలిపే విధంగా రాజకీయాలు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకొంటున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గతంలో అతని తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఆవిధంగానే చేసేరని జగన్ కి గుర్తు చేసి, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తన మనసు నొప్పించే విధంగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ప్రజల కోసం అన్నీ ఓర్చుకొని ముందుకు సాగుతున్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఇంతకీ చంద్రబాబు నాయుడు చేస్తున్న విదేశీ యాత్రల వలన రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చేయి? రాష్ట్రంలో కొత్తగా ఎన్ని పరిశ్రమలు ఎక్కడెక్కడ స్థాపింపబడ్డాయి? అవి ఏ ఏ దశలలో ఉన్నాయి. వాటి వలన ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేయి? తన మంచితనాన్ని చూసే సింగపూర్, జపాన్ సంస్థలు రాజధాని నిర్మాణానికి పెట్టుబడులు పెట్టడానికి ముందు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు చెప్పుకొంటునప్పుడు, అవి దాని కోసం గొంతెమ్మ కోరికలు ఎందుకు కోరుతున్నాయి? అసలు అవి ఏమి కోరుతున్నాయి? ప్రభుత్వం వాటికి ఏమి ఆఫర్ చేస్తోంది? వంటి ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానాలు చెప్పి ప్రజల, ప్రతిపక్షాల సందేహాలు తీర్చి ఉండి ఉంటే, ఆయన విశ్వసనీయత పెరిగి ఉండేది.