తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆంధ్రాలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఏంటనేది సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అయితే, అసెంబ్లీ వరకూ కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు ఉండదు అనే అభిప్రాయం కొంతమంది టీడీపీ నేతల్లోనూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పాత్ర ఏంటనేది ఇంకా ఏపీ కాంగ్రెస్ నుంచి స్పష్టత లేదు. అలాగని, జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ తో టీడీపీ దోస్తీ కొనసాగడంలో ఎలాంటి అనుమానాలూ లేవన్నట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు ఉంటోంది. దీంతోపాటు, కాంగ్రెస్ విషయంలో ఎందుకు కలిసి కొనసాగాల్సిన పరిస్థితి ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి తరచూ చేయడం మొదలుపెట్టారు.
అమరావతిలో మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తానేదో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టుగా కొంతమంది విమర్శలు చేస్తున్నారనీ, అలాంటి పరిస్థితి లేదన్నారు. ‘దేశానికి నష్టం కలుగుతోంది బీజేపీ వల్ల, అన్ని రాజకీయ పార్టీలు కలిసి దేశాన్నీ ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకోవాలి’ అన్నారు. ఆంధ్రాకు తీవ్రమైన నష్టం చేసిన పార్టీ బీజేపీ అనీ, రాష్ట్ర ప్రయోజనాలూ దేశ ప్రయోజనాలూ కాపాడుకోవాలనుకున్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనుకున్నప్పుడు… అందరూ కలిసి ముందుకుపోవాలని పెట్టామన్నారు. దీన్ని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. మొన్ననే… శ్రీకాకుళంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ… ఆ పార్టీతో చాన్నాళ్లుగా పోరాటం చేశామనీ, కానీ కేంద్రంలో భాజపాని గద్దెదించాలంటే అన్ని పార్టీలతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో జరిగిన ఓ సదస్సులో కూడా ఇదే అంశం ప్రస్థావిస్తూ… రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా మద్దతు ఇవ్వడమే తన అజెండా కాందంటూ స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఈ పొత్తు భవిష్యత్తు ఏంటనే చర్చ మొదలైన సంగతి తెలిసిందే. అయితే, అక్కడి ఫలితాలను నేపథ్యంగా తీసుకుని, ఆంధ్రా రాజకీయ పరిస్థితులను అంచనా వేయడమూ సరైంది కాదు. ఆంధ్రాలో రాబోయే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు వేరు. రాష్ట్రంతోపాటు, కేంద్రంలో కూడా అధికారం చేపట్టబోయే పార్టీని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు ఎన్నికలకు ఎదుర్కోవాల్సి ఉంది. ఎందుకంటే, ఆంధ్రాకి కేంద్రం చేయాల్సింది చాలా ఉంది. సో… ఈ రెండు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే… కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరమూ అర్థమౌతున్నదే. అయితే, ఈ క్రమంలో ప్రతిపక్షాలు దూరదృష్టికి అందని అంశం… ఎన్నికల తరువాత కేంద్రం ద్వారా రాష్ట్రం సాధించుకోవాల్సిన ప్రయోజనాలు! కానీ, ఈ అంశాన్ని వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసం… కేవలం టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు అనే అంశాన్నే హైలైట్ చేస్తున్నాయి. దీన్ని సమర్థంగా ఎదుర్కొంటూ, వాస్తవాలను ప్రజలను వివరించాలంటే… టీడీపీ వివరంగా చెప్పాల్సింది చాలానే కనిపిస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని పదేపదే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.