ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది కాపుల రిజర్వేషన్ల డిమాండ్. కాపులను బీసీల్లో చేర్చాలంటూ సంఘాల నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆయన్ని గృహ నిర్బంధం చేస్తే చాలు, కొన్నాళ్లపాటు ఆ డిమాండ్ ను వాయిదా వెయ్యొచ్చు అన్నట్టుగానే ఇప్పటివరకూ ప్రభుత్వ వైఖరి ఉంది. ఇంకోపక్క, రిజర్వేషన్ల కోసమే ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదిక ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీనికోసం లేఖ రాశామని ప్రభుత్వం చెప్తోంది. అయితే, ఈ అంశమై ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే, అధికార పార్టీపై కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందన్నది వాస్తవం. మరి, ఇవన్నీ లెక్కలేసుకున్నారే ఏమో తెలీదుగానీ.. కాపుల రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వ తరఫు నుంచి ఓ కీలక ప్రకటన చేయబోతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నాడు విజయవాడలో ఇదే అంశమై చర్చిస్తున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన వివిధ సంఘాల నాయకులతోపాటు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతున్నారు. దాదాపు మూడు గంటలపాటు ఈ భేటీ ఉండొచ్చని చెబుతున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ నేతతోపాటు ఈ కార్యక్రమానికి దాదాపు రెండు వేల మంది కాపు నేతలు హాజరు కాబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో కాపుల రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చిస్తారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతున్న ఈ భేటీలో రిజర్వేషన్ల అంశమై ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. ఈ వేదికపై నుంచే ముద్రగడపై టీడీపీ ఎదురుదాడి మొదలుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక, ఇంత భారీ సంఖ్యలో కాపు నేతలతో సమావేశం ఏర్పాటు వెనక రాజకీయ కోణం వేరే ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల కాపులు తెలుగుదేశం పార్టీని ఎంతగానో ఆదరించారు. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాపుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరిగా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. రిజర్వేషన్ల ఉద్యమాన్ని అడ్డుకునే తీరు వల్ల కూడా ఈ అభిప్రాయం పెరిగిందనే ఓ అంచనా అధికార పార్టీ వర్గాల్లో ఉంది. ఆ సామాజిక వర్గంలో పెరుగుతున్న వ్యతిరేకతకు వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. త్వరలోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కాకినాడలో టీడీపీ గెలిస్తే కాపులకే మేయర్ పదవి అన్నట్టుగా ఇప్పటికే సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు రిజర్వేషన్ల విషయమై ఏదో ఒక సానుకూల ప్రకటన ఉండబోతోంది. దీంతో ఆ రెండు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గాన్ని మరోసారి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.