తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎలాంటి పదవుల్ని ఆశించడం లేదని చంద్రబాబు ఢిల్లీలో స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన కీలక విషయాలపై స్పందించారు. డిప్యూటీ స్పీకర్ పోస్టు తీసుకుంటున్నారా అని మీడియా ప్రతినిధులు ఆరా తీస్తే ఆశ్చర్యకరమన సమాధానం చెప్పారు. అసలు డిప్యూటీ స్పీకర్ పోస్టుపై ఎలాంటి చర్చలు జరగలేదని.. వాళ్లు ఇస్తామనలేదు… తాము అడగలేదని తేల్చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు మాటల్ని బట్టి చూస్తే.. ఆ పోస్టుకు టీడీపీ పోటీ పడటం లేదని అర్థం చేసుకోవచ్చు.
పదవుల కోసం తాము చూడటం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నందున వారు ఆఫర్ చేసిన రెండు మంత్రి పదవుల్ని తీసుకున్నామన్నారు. వాజ్ పేయి హాయాంలో ఏడు మంత్రి పదవులు ఇస్తామన్నారని.. కానీ అవేమీ వద్దని చెప్పి ఒక్క స్పీకర్ పదవినే తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం కానీ పదవుల గురించి కాదని అంటున్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తల్ని సంప్రదిస్తూంటే మళ్లీ జగన్ వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అయితే డెవిల్ ను నియంత్రించామని ఇక ఎలాంటి సమస్యా రాదని భరోసా ఇస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డితో భేటీలో.. రాష్ట్ర విభజన అంశాలపై సమగ్రంగా చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. డిల్లీ పర్యటనలో చంద్రబాబు .. వచ్చే పూర్తి స్థాయి బడ్జెట్‌లో వివిధ శాఖల ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించేలా చూసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.