అమరావతి విషయంలో ఎన్నికలకు ముందు ఓ మాట.. ఎన్నికలు అయిన తర్వాత మరో మాట చెబుతున్నందున తక్షణం ప్రజాతీర్పు కోరాలని చంద్రబాబు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా ప్రజల మద్దతు అమరావతికే ఉందని ఆయన అంటున్నారు. అయితే.. ఈ విషయంలో వైసీపీ నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. తాము రాజీనామాలు చేయబోమని.. వైసీపీ నేతలు తేల్చేశారు. దీంతో.. వైసీపీపై మరింత ఒత్తిడి పెంచేందుకు.. చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని వెల్లడించే వేదికను ప్రారంభించారు. www.apwithamaravathi.com పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పదమూడు జిల్లాల ప్రజలు..ఏపీ రాజధానికిగా అమరావతిని కోరుకుటుంన్నారా? లేదా? అనే విషయాన్ని ఈ వెబ్సైట్ ద్వారా తెలియచేయవచ్చని చంద్రబాబు చెబుతున్నారు.
వాస్తవానికి అమరావతి విషయంలో ప్రజాభిప్రాయం… ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంది. జాతీయ మీడియా పెట్టిన పోల్స్‌తో పాటు… సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ పెట్టిన పోస్టుల్లోనూ అమరావతికే మద్దతు లభించింది. ప్రాంతాలకు అతీతంగా రాజధాని కోసం.. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను అందరూ గుర్తించారు. ఈ క్రమంలో.. పోల్స్ అన్నింటిలో ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకత వచ్చింది. అందుకే.. ఏపీ సర్కార్ ఎక్కడా ప్రజాభిప్రాయ సేకరణ అనే మాట వద్దకు వెళ్లడం లేదు. ఇప్పుడు ఏమైనా వ్యతిరేకత ఉంటే.. వచ్చే ఎన్నికల నాటికి తగ్గిపోతుందన్న అంచనాలో ఉంది.
అయితే..మూడు రాజధానులు అంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయడమేనని.. రూపు దిద్దుకోవాల్సిన ఓ మహానగరాన్ని .. అంతం చేసినట్లు అవుతుందని అంటున్న చంద్రబాబు… తన వంతు ప్రయత్నాలను తాను చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా వెల్లడించే అవకాశం లేకుండా పోయింది. దీంతో.. వెబ్ సైట్ ద్వారా.. అమరావతికి మద్దతు తెలిపే అవకాశాన్ని చంద్రబాబు ముందుకు తెచ్చారు. అయితే.. టెక్నికల్ ఇష్యూలో .. లేకపోతే..ఎక్కువ మంది ఒకే సారి లాగిన్ అయ్యే ప్రయత్నం చేశారేమో కానీ కాసేపటికే ఆ వెబ్ సైట్ క్రాష్ అయింది.