ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా బ్యాలెన్స్డ్ రాజకీయాలు చేస్తూంటారు. రాజకీయంగా ఆరోపణలు చేసేటప్పుడే ముందూ వెనుకా ఆలోచిస్తారు. అదే గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా వరకూ కంట్రోల్ చేసుకుంటూంటారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన గవర్నర్ వ్యవస్థపై తన ఆగ్రహాన్ని ఏ మాత్రం దాచుకోవడం లేదు. రాజ్‌భవన్ కేంద్రంగా… తెలుగుదేశం పార్టీపై, ప్రభుత్వంపై.. నరసింహన్ కుట్ర పన్నుతున్నారని ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో.. కొద్ది రోజుల కిందట అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా అని ప్రకటించి సంచలనం రేపారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు గవర్నర్ పదవి కూడా గౌరవం ఇవ్వకుండా.. విమర్శించేశారు.
తాజాగా ఇప్పుడు చంద్రబాబు.. గవర్నర్ కార్యాలయాలను… కేంద్రం రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని… నేరుగా ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అటు ఢిల్లీలోనూ..ఇటు ఏపీలోనూ కలకలం రేగింది. కారణం… గవర్నర్ నరసింహన్ ప్రస్తుతం రాజకీయ నివేదికలతో… హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీల కోసం ఢిల్లీకి పరుగులు తీయడమే. కొద్ది రోజుల కిందటే… గంట సేపు ప్రధాని మోదీతో సమావేశమైన గవర్నర్ ఏపీ రాజకీయాలపైనే ఎక్కువగా చర్చించారన్న ప్రచారం జరిగింది. అలా హైదరాబాద్ వచ్చీ రాగానే ఏపీ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. మోదీని అందరూ తిడుతున్నారన్న కారణం చూపి.. ఫిర్యాదు చేయడానికి వెళ్లామని బీజేపీ నేతలు చెప్పుకున్నా… వాస్తవం మాత్రం.. గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుంచి ఏదో సందేశం తెచ్చారన్నదేనన్న అనుమానాలున్నాయి.
ఈ లోపే ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేశారు. బీజేపీ అగ్రనేతలతో చర్చల్లో మునిగి తేలుతున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… రామ్‌మాధవ్‌ను కలిశారు. కోఇన్సిడెన్స్‌గా ఏపీ రాజకీయాలపై నివేదికలతో గవర్నర్ ఢిల్లీకి చేరుకున్నారు. రాజకీయాలకు సంబంధం లేకపోతే.. హుటాహుటిన ఢిల్లీకి పోవాల్సినంత ఘనకార్యాలేమీ తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. ఇంకో విశేషం ఏమింటే… కేసీఆర్ కూడా…. అదే సమయంలో ఢిల్లీలో ఉండటం.
ఈ తరుణంలో… గవర్నర్ కేంద్రంగా.. ఢిల్లీలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయన్న కచ్చితమైన సమాచారం ఉండబట్టే…చంద్రబాబు ట్వీట్ చేశారని అందరూ భావించారు. అయితే వెంటనే… లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఢిల్లీ ముంఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపారు. గవర్నర్ రాజకీయాల కారణంగా… బాధలు పడుతున్న ఢిల్లీ ప్రజలకు సానుభూతి తెలిపారు.మొత్తానికి చంద్రబాబు గవర్నర్ వ్యవస్థను టార్గెట్ చేసి.. మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. గవర్నర్ల వ్యవస్థపై మరోసారి చర్చను లేవదీశారు.