తెరాసను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో తెరాసతో కలిసి వెళ్లాలని తాము అనుకున్నామనీ, అలా చేస్తే తెలుగు రాష్ట్రాలు మరింత బలపడే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే భాజపా కుట్ర చేసిందని విమర్శించారు. టీడీపీ, తెరాసలను కలవకుండా చేశారంటూ మండిపడ్డారు. ‘తెలంగాణలో టి.ఆర్.ఎస్.తో కలవకుండా ఉండే కుట్ర చేశారు. రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టాలి, తెలుగుదేశాన్ని దెబ్బతియ్యాలి, ఆంధ్రాకి అన్యాయం చెయ్యాలి’ అంటూ భాజపాపై విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ తాము పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, దేశంలోని అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్డీయేలో ఉన్న కొన్ని పార్టీలు కూడా మన డిమాండ్ కి సహకరించాయన్నారు. ‘తెరాస పార్టీ అప్పటి వరకూ సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే భాజపాతో టీడీపీ పొత్తు తెంచుకుందో… తరువాత మనసు మార్చుకుని, హోదాని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. కారణాలు ఏవైనా కావొచ్చు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, వైకాపా మాత్రం రాజీనామా చేసి, భాజపా సంఖ్యా బలం పెంచేలా సహకరించారని ఆరోపించారు. జగన్ కు భాజపా అంటే భయమనీ… ఆ పార్టీతో పెట్టుకుంటే తమిళనాడులో శశికళ ఎపిసోడ్ ఆంధ్రాలో రిపీట్ చేస్తారనే భయపడ్డారంటూ వ్యాఖ్యానించారు.
నిజానికి, ఒక దశలో టీడీపీ-తెరాసల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందనే పరిస్థితి కొన్నాళ్ల కిందట కనిపించింది. ఇద్దరు చంద్రులూ కలవడం వల్ల… కేంద్రంపై ఒత్తిడి పెంచడం సులువు అవుతుందనే అభిప్రాయమూ వ్యక్తమైంది. కానీ, ఆ తరువాత నుంచి మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను కేసీఆర్ ఆహా ఓహో అనడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల ఐక్యతను దెబ్బతీయడం కోసం భాజపా వేసిన ఎత్తుగడలో భాగంగానే కేసీఆర్ ను కేంద్రం దగ్గర చేసుకుందనడంలో వాస్తవం లేకపోలేదు. అది కూడా టీడీపీని బలహీనపరచాలన్న అజెండా నుంచి మొదలైన ప్రయత్నంగా దీన్ని చెప్పుకోవచ్చు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు.
అయితే, త్వరలో తెలంగాణ అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో.. తెరాసతో కలిసి పనిచేయాలనే మనోగతాన్ని చంద్రబాబు బయటపెట్టడం ప్రత్యేకంగానే చూడాలి. ఎందుకంటే, తెలంగాణలో మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి టీడీపీకి ఇప్పుడు ఏర్పడింది. దీనిపై భాజపాతోపాటు ఇతర పార్టీలూ విమర్శలు చేస్తున్నాయి. ఆంధ్రాలో కూడా దీన్నొక పెద్ద ఇష్యూ చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి! ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యల ద్వారా ఓ వివరణ ఇచ్చినట్టుగా కూడా భావించొచ్చు. తెలంగాణలో తెరాసతోనే కలిసి వెళ్లాలన్నది తమ అభిమతమైనప్పటికీ… దీన్ని భాజపా చెడగొట్టిందీ అని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారనీ అనుకోవచ్చు.