“వద్దని చెప్పినా వినకుండా జగన్కు ఓట్లేసి.. నెత్తిన మీద కుంపటి తెచ్చి పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఒక్క సారి అంటూ.. కరెంట్ తీగను పట్టుకోవద్దు అంటూ హెచ్చరించా.. కానీ వినలేదు.. ” అంటూ చంద్రబాబు.. తనకు ఓట్లేయని వారిపై.. సెటైర్లను సమయం చూసి వదిలారు. రాజధాని పోరాటంలో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతులకు సంఘిభావం ప్రకటిచిన చంద్రబాబు… ప్రజలు కూడా.. ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రజల వైపు కూడా తప్పుందన్నారు. ఎన్నికల ముందే కాదు.. ఎన్నికల తర్వాత కూడా.. జరిగిన పరిణామాల విషయంలో సైలెంట్ గా ఉన్న ప్రజలపై సెటైర్లు వేశారు.
మొదట జగన్ ప్రజావేదికను కూల్చేస్తే మనకెందుకలే అనుకున్నారని.. తర్వాత ఇంటిని ముంచడానికి ప్రయత్నిస్తే.. అది చంద్రబాబు గొడవలే అనుకున్నారని..ఇప్పుడు.. రాజధాని మీదకు వచ్చిన తర్వాతే అందరికీ గుర్తొచ్చిందని వ్యాఖ్యానించారు. నవ్వుతూనే.. చంద్రబాబు సెటైర్లు వేశారు. చాలా మంది రాజధాని రైతులు.. మీడియాతో మాట్లాడుతూ.. తాము కష్టపడి జగన్కు ఓట్లేశామని.. ఓట్లేయించామని.. అయినా తమ నెత్తి చేయి పెట్టారని.. వాపోతున్నారు. నిజంగానే ఆయా గ్రామాల్లో ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ వచ్చింది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో.. టీడీపీ నేతలకే అర్థం కాలేదు. ఒక్క చాన్స్ మహిమ అని ఊరుకున్నారు. నిజానికి ఒక్క చాన్స్ అంటూ జగన్ ప్రతీ ఎన్నికల ప్రచారసభలోనూ అడిగారు.
దానికి ఓటర్లు కరిగిపోతారని.. చంద్రబాబు కూడా అనుకున్నారు. ఆ సమయంలో… చంద్రబాబు కూడా వ్యూహం మార్చారు. తాను శాశ్వతం కాదని… రాష్ట్రం శాశ్వతమని.. అమరావతి శాశ్వతమని… పోలవరం శాశ్వతమని..చెప్పుకొచ్చారు. కానీ ఆయన మాటలను ఏపీ ప్రజలు ఆలకించలేదు. ఇప్పుడు ప్రజలు.. తమ తమ కష్టాలతో రోడ్ల మీదకు రాగానే.. చంద్రబాబు.. తాను ఎన్నికల ప్రచారంలో చేసిన విజ్ఞప్తులు.. వాటిని గుర్తు చేసి.. తప్పు చేశారని.. ప్రజలపై సెటైర్లేస్తున్నారు.