ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. వారే దోషులవుతారని..చంద్రబాబు హెచ్చరించారు. అసెంబ్లీలో…మాట్లాడటానికి మైక్ ఇవ్వకపోతూండటంతో.. అక్కడ చెప్పాలనుకున్నది రోజూ ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు చంద్రబాబు. ప్రజల్లో వైసీపీ అభద్రతా భావాన్ని సృష్టిస్తోందని…టీడీపీ కార్యకర్తలపై ఇప్పటి వరకు 285 దాడులు జరిగాయని.. వీటిలో ఏడు హత్యలు ఉన్నాయని టీడీపీ అధినేత మండిపడ్డారు. సీఎం, హోంమంత్రికి ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి పేర్ని నాని ఇబ్బందులకు గురిచేస్తున్నారని… మహిళ లెటర్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని… మంత్రి పేర్ని నాని అరాచకాలు సీఎంకు కనిపించలేదా.. అని చంద్రబాబు ప్రశ్నించారు.
పోలీసులు నిమిత్త మాత్రులుగా వ్యవహరిస్తున్నారని… చర్యలు తీసుకోకపోతే.. చట్టం ముందు దోషులుగా నిలబడతారని చంద్రబాబు హెచ్చరించారు. 70 ఏళ్లు దాటిన వారిపైనా..చిన్న చిన్న ఉద్యోగులపైనా దాడులు చేస్తున్నారని విమర్శించారు. మీ రౌడీయిజం పులివెందులలో చూపించుకోండి.. భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమన్నారు. అసెంబ్లీలో ఈ రోజు.. టీడీపీ కార్యకర్తలపై దాడుల గురించి మాట్లాడాలని టీడీపీ అనుకుంది. అయితే.. అధికారపక్షం ఆ అవకాశం ఇవ్వలేదు. అదే కాదు.. అసలు.. టీడీపీ సభ్యులకు కానీ… ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కానీ.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో.. చూసి..చూసి.. చంద్రబాబు ..తన సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు.
మొదట్లో.. అధికారపక్షం… టీడీపీ సభ్యులకు మైక్ ఇచ్చినా… 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న జగన్ హామీని టీడీపీ హైలెట్ చేసిన తర్వాత విధానం మార్చుకుంది. పైగా.. ప్రశ్నలు వేసినప్పుడు.. చర్చకు అవకాశం ఇవ్వడం లేదు. నేరుగా ముఖ్యమంత్రే.. అలా… ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదని…సభలోనే చెప్పడంతో.. ప్రతిపక్షానికి మైకులు ఇవ్వడం… స్పీకర్ దాదాపుగా మానేశారు. దాంతో చంద్రబాబుకు ప్రెస్ మీట్ పెట్టి.. తమ పార్టీ వాదన వినిపించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.